దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు (Jamili Elections) నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. దీనిలో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేక హై లెవల్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ కమిటీ జమిలి ఎన్నికల అమలు సాధ్యాసాధ్యాలు, రాజ్యాంగ పరిష్కారాలపై అధ్యయనం చేస్తోంది.
జమిలి ఎన్నికలు అంటే ఏంటి?
జమిలి (సంయుక్త) ఎన్నికలు అంటే దేశంలోని లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే. ప్రస్తుతం వీటి కోసం వేర్వేరు కాలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో నిత్యం ఎక్కడో ఓ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. కానీ జమిలి ఎన్నికల ద్వారా ఒక్కసారిగా మొత్తం దేశవ్యాప్తంగా ఓటింగ్ జరిపి, పరిపాలనలో స్థిరత తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం.
జమిలి ఎన్నికల వల్ల లాభాలేంటి?
జమిలి ఎన్నికలు జరిగితే పలు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా, తరచూ జరిగే ఎన్నికల వల్ల ప్రభుత్వ యంత్రాంగం దృష్టి ఎన్నికలపైనే ఉండటం తగ్గుతుంది. రెండవది, ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఓటర్ల అవగాహన మెరుగవుతుంది. రాజకీయ పార్టీల ఖర్చులు తగ్గి, పరిపాలనపై దృష్టి పెరుగుతుంది. దీని వల్ల పాలనా సామర్థ్యం మెరుగవుతుంది, వృద్ధికి బాటలు పడతాయి.
జమిలి ఎన్నికల సవాళ్లు
జమిలి ఎన్నికలు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. రాష్ట్రాల శాసనసభల రద్దు లేదా కొనసాగింపు వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. అంతేకాదు, దేశమంతటా ఒక్కేసారి ఎన్నికలు నిర్వహించడం మానవ వనరులు, భద్రతా దళాల పరంగా పెద్ద సవాలే. అయినా, ఈ విధానం దేశానికి మంచి పరిపాలన కోసం కీలకంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు