Site icon HashtagU Telugu

Jamili Elections : జమిలి ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రామ్ నాథ్ కోవింద్.. 8 మంది సభ్యులతో కమిటీ..

Jamili Elections Committee by Ministry of law and Justice with 8 Members and Ram nath Kovind as Head

Jamili Elections Committee by Ministry of law and Justice with 8 Members and Ram nath Kovind as Head

ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు(One Nation-One Election) అనే నినాదం బీజేపీ(BJP) పార్టీ ఎప్పట్నుంచో చేస్తుంది. దీనికి పలు పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దేశమంతటా ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీనికి ఖర్చు భారీగా అవుతుంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి అనే ముఖ్య ఉద్దేశంతోనే జమిలి ఎన్నికల కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.

కొన్ని ప్రతిపక్ష పార్టీలకు దీనివల్ల నష్టం చేకూరుతుందని గతంలో వ్యతిరేకించాయి. ఇప్పుడు మరోసారి ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదం బీజేపీ తీసుకొచ్చింది. త్వరలో పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఉంటాయని, దీనికోసమే ఆ సమావేశాలు అని చర్చ జరుగుతుంది.

తాజాగా జమిలి ఎన్నికల(Jamili Elections) కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను చైర్మన్ గా నియమించింది. ఈ కమిటీలో కేంద్రమంత్రి అమిత్ షా, లోక్ సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను సభ్యులుగా నియమించింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు కట్టబెట్టింది.

జమిలి ఎన్నికలపై న్యాయశాఖ నియమించిన ఈ కమిటీ వెంటనే పని ప్రారంభించి.. నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని కోరింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానానికి కేంద్రం మొగ్గుచూపిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానానికి ప్రభుత్వం ఇష్టపడినా.. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలను అధిగమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

Also Read : Jamili Elections : కేసీఆర్ కు బీజేపీ జ‌ల‌క్ ఇచ్చిన‌ట్టేనా?