America Tour : విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారంనాడు ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 29 వరకు జైశంకర్ ఆగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధులతో చర్చిస్తారు. అలాగే భారత కాన్సుల్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక, గత వారం అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) సమావేశంలో యూఎస్-ఇండియా పటిష్ట భాగస్వామ్యంపై భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్‌సెట్టి మాట్లాడారు. నిష్పాక్షికత, సమానత్వం ప్రాతిపదికగా తక్కువ పన్నులు, ఎక్కువ వాణిజ్యంపై కలిసికట్టుగా ఉభయదేశాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, సామర్థ్యాన్ని కూడా కలిసి పంచుకోవాలని అన్నారు. భారతదేశంలోని వర్క్‌ఫోర్స్‌ను ఆయన ప్రశంసించారు. కాగా, అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్‌లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. అయితే డోనాల్డ్ ట్రంప్‌ను జైశంకర్ కలుస్తారా లేదా అనే విషయాన్ని ఎంఈఓ వెల్లడించలేదు.
Read Also: Shyam Benegal Dies : శ్యామ్ బెనెగల్ మృతి