Secret Meeting : కెనడాలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపణలు చేసింది. అదేం లేదని భారత్ ఖండించింది. ఖలిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని భారత్ విమర్శించింది. కట్ చేస్తే.. ఇదంతా గతం!! తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ మధ్య రహస్య భేటీ జరిగింది. ఖలిస్థాన్ ఉగ్రమూకల అంశంపై రెండు దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ప్రతిష్టంభనను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపై ఈ రహస్య మీటింగ్ లో చర్చించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వివరాలతో బ్రిటన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ రహస్య సమావేశంపై భారత్, కెనడాలు ఇంకా స్పందించలేదు. గతాన్ని పక్కన పెట్టి.. మునుపటిలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని భారత్, కెనడా నిర్ణయించాయని అంటున్నారు. ఇరుదేశాలు దౌత్యవేత్తలను వెళ్లిపోవాలని పరస్పరం వార్నింగ్ లు ఇచ్చుకునే స్థాయికి వెళ్లిన ఈ వివాదానికి ఈవిధంగా సీక్రెట్ మీటింగ్ తో సయోధ్య కార్డు పడటం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
అమెరికా మధ్యవర్తిత్వంతోనే వాషింగ్టన్ లో కెనడా, భారత్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారని తెలుస్తోంది. కెనడా వివాదం కారణంగా భారత్ తో తమ సంబంధాలు దెబ్బతినడం ఇష్టం లేకపోవడంతో.. అమెరికా చొరవ చూపి ఈ చర్చలు జరిగేలా చేసిందని సమాచారం. ఇక మిగిలింది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యవహార శైలి. ఆయన ఇటీవల ట్విట్టర్ లో ఒక వివాదాస్పద పోస్టు పెట్టారు. ‘‘యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు జాయెద్‌తో నేను భారత్ అంశం, చట్టాన్ని గౌరవించడం, సమర్థించడం ప్రాముఖ్యత గురించి మాట్లాడాను’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ట్రూడో వ్యవహార శైలిని మార్చుకోకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినా (Secret Meeting) ఆశ్చర్యం ఉండదు.