రాజకీయాల్లో ఓ సారి జైలు జీవితం గడిపిన నేతలు..నెక్స్ట్ రాష్ట్రాన్ని పాలించే అదృష్టం (Jail Sentiment ) వరిస్తుంటుంది. జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, హేమంత్ సోరెన్ వంటి నేతలు జైలుకు వెళ్లి తిరిగి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జైలుకెళ్లి వచ్చిన నేతల పాలిట రాజకీయ భవిష్యత్తు మరింత మెరుగవుతుందనే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ నెలకొంది. అయితే ఆ సెంటిమెంట్ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రివాల్ (Kejriwal) విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయన, ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైనా, తన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేజ్రివాల్ స్వయంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం విశేషం. ఈ ఫలితాలు జైలు వెళ్ళినంత మాత్రాన తిరిగి అధికారం దక్కదనే వాస్తవాన్ని స్పష్టంగా చూపించాయి.
CM Revanth Reddy : దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన టైం – సీఎం రేవంత్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా పరాజయం పాలైంది. బీజేపీ బలపడటంతో కేజ్రివాల్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు – అన్నీ కలిసివచ్చి ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఇప్పటి వరకూ జైలుకు వెళ్లిన నేతలు తిరిగి అధికారాన్ని సాధించగలిగారు. కానీ కేజ్రివాల్ మాత్రం ఆ సెంటిమెంట్‌ను కొనసాగించలేకపోయారు. ప్రజలు అవినీతి ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేజ్రివాల్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సర్వసాధారణంగా జైలు నుంచి వచ్చిన నేతలపై ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుంది. అయితే, కేజ్రివాల్ విషయంలో ఇది విరుద్ధంగా మారింది. జైలు సెంటిమెంట్ అన్ని రాజకీయ నేతలకూ వర్తించదనే విషయాన్ని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.