Site icon HashtagU Telugu

Jagdeep Dhankhar : భార‌త 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ జగదీప్ ధంఖర్

Nda Jagdeep Dhankhar Vice President Imresizer

Nda Jagdeep Dhankhar Vice President Imresizer

భార‌త దేశ 14వ‌ ఉపరాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్ జగదీప్‌ ధన్‌కర్ నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం 11:45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన‌ జగదీప్ ధంఖర్‌తో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆగస్టు 6న ధనఖర్ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షానికి చెందిన మార్గరెట్ అల్వాను ఓడించి విజేతగా నిలిచారు. ఆగస్ట్ 7న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమీషనర్ అనుప్ చంద్ర పాండే సంయుక్తంగా ‘భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ ఎన్నికన‌ట్లు ధృవీక‌ర‌ణ ప‌త్రం అందించారు.

మొత్తం 780 మంది ఓటర్లకు గాను 725 మంది ఓటు వేయగా 15 ఓట్లు చెల్లవని తేలిందని ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. 92.94 శాతం పోలింగ్ నమోదైందని, ఒక అభ్యర్థి ఎన్నిక కావడానికి 356 ఓట్లు అవసరమని ఆయన చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక ఓట్లు జ‌గ‌దీప్ ధంకర్ సాధించి గెలిచారు. లోక్‌సభలో 23 మందితో సహా మొత్తం 36 మంది ఎంపీలను కలిగి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉంది. అయితే ఇద్దరు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 55 మంది ఎంపీలు ఓటు వేయలేదు.

మే 18, 1951న రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ధన్‌ఖర్ చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయ‌న రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి LLB చ‌దివారు. మొదటి తరం ప్రొఫెషనల్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరు అయ్యారు. 71 ఏళ్ల ధంఖర్ రాజస్థాన్ హైకోర్టు, భారత సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ టిక్కెట్‌పై ఝుంజును నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ధంఖ‌ర్‌ 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. జాట్ కమ్యూనిటీకి చెందిన ధంఖర్, తర్వాత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుండి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధంఖర్ నియమితులయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన తర్వాత జూలై 17న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా ఉంటారు.