Site icon HashtagU Telugu

Jagdeep Dhankhar: ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఘన విజయం

Nda Jagdeep Dhankhar Vice President Imresizer

Nda Jagdeep Dhankhar Vice President Imresizer

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీయే అభ్య‌ర్థి  ప‌శ్చిమబెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ విజ‌యం సాధించారు. అధికార ప‌క్షం ఎన్డీయేకు పార్ల‌మెంట్లో పూర్తి మెజారిటీ ఉండ‌డంతో, ఆ ప‌క్షం బ‌రిలో నిలిపిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ సునాయాసంగా గెలుపొందారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది.
మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్‌ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఈ స్థాయిలో ఘ‌న విజయం సాధించ‌డం చాలా అరుదు. నిజానికి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి 356 ఓట్లు వ‌స్తే చాలు. కానీ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ కు 528 ఓట్లు వ‌చ్చాయి. అంటే మొత్తం పోలైన‌, చెల్లిన ఓట్ల‌లో 74.36 శాతం. 1997 త‌రువాత ఇదే గొప్ప విజ‌యం. గ‌త ఆరు ప‌ర్యాయాల్లో ఎవ‌రూ ఇంత మెజారిటీతో విజ‌యం సాధించ‌లేదు. ఉప‌రాష్ట్ర‌ప‌తి గా పోటీ చేసే ముందు వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధుల రేసులో హేమాహేమీల పేర్లు వినిపించినప్పటికీ.. వారందరినీ పక్కనబెట్టి కమలనాథులు జగదీప్‌వైపే మొగ్గుచూపారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ప‌లు ఎన్డీయేత‌ర పార్టీలు కూడా మ‌ద్ద‌తిచ్చాయి.

వాటిలో బిజూ జ‌న‌తాద‌ళ్‌, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీఎస్పీ, జేఎంఎం, అకాలీద‌ళ్‌, శివ‌సేన షిండే వ‌ర్గం వంటివి ఉన్నాయి. భార‌త‌దేశ 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న ఆగ‌స్ట్ 11న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆగ‌స్ట్ 10న ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారు. కాగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ కు ప్ర‌ధాని మోదీ, విప‌క్ష అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన మార్గ‌రెట్ అల్వా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌, బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.