Site icon HashtagU Telugu

Nobel Peace Prize: ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి.. అసలు నిజం ఇదే..!

PM Modi

Modi

నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అస్లే టోజే గురించి అనేక మీడియా సంస్థలు పేర్కొంటున్న ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతిపెద్ద పోటీదారు అని పిలిచారు. అలాంటి వార్తలు వైరల్ అయిన తర్వాత అస్లే టోజే ఒక వీడియో ద్వారా తన స్పందనను ఇచ్చారు. అదే సమయంలో ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్‌తో పంచుకున్నారు.

మార్చి 15, 2023న మేగ్ అప్‌డేట్స్ పేరుతో ధృవీకరించబడిన ట్విట్టర్ హ్యాండిల్ నోబెల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అస్లే టోజే ఫోటోను షేర్ చేసింది. నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అతిపెద్ద పోటీదారు అని పోస్ట్‌కు క్యాప్షన్‌లో రాశారు. అతను ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. ప్రపంచ శాంతి వ్యవస్థను పునరుద్ధరించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాడని పోస్ట్ చేశారు.

నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతిపెద్ద పోటీదారు అనే విషయాన్ని అస్లే టోజే ఫేక్ న్యూస్ అంటూ పూర్తిగా తిరస్కరించారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ బలమైన ప్రత్యర్థిగా ప్రస్తావన లేదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి టోజే వీడియోను చాలా మంది షేర్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ కూడా వీడియోను పంచుకున్నారు. తాను చెప్పిందొకటి.. బయట ప్రచారంలోకి వచ్చిందొకటని తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో తాను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్‌ హోదాలో పర్యటించట్లేదని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్‌స్టాండింగ్ కమిటీ డైరెక్టర్ గా మాత్రమే ఇక్కడికి వచ్చానని ఆస్లే టోజే పేర్కొన్నారు.

అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాలను రష్యాకు గుర్తు చేయడానికి భారతదేశం జోక్యాన్ని టోజే ప్రశంసించారు. భారతదేశం తన ప్రపంచ బాధ్యతను స్వీకరించడానికి, బలమైన శక్తిగా మారడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని శాంతికి అత్యంత విశ్వసనీయ ముఖాలలో మోదీ ఒకరని చూడటం సంతోషంగా ఉందని అన్నారు. టోజే 2012-2018 వరకు నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 5 మంది సభ్యుల నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ పదవిలో అతను 2024 వరకు కొనసాగుతారు.

Exit mobile version