Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!

  • Written By:
  • Updated On - November 28, 2022 / 01:20 PM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర్యటించారు. నేత్రాంగ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఉగ్రవాదులను ప్రోత్సహించేది కాంగ్రెస్సే అంటూ ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాదం పేట్రేగిపోయిందన్నారు. చాలా కాలంగా ఉగ్రవాదుల లక్ష్యంలో గుజరాత్ ఉందన్న మోదీ…ఇప్పుడు ఉగ్రవాదం అంతం కావాలని కోరుకుంటుదన్నారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాద జాడలు లేకుండా అంతం చేశామన్నారు. టెర్రరిస్టుల విషయంలో బీజేపీ ఎప్పుడూ కఠిన చర్యలు తీసుకుందన్నారు. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ ఉగ్రవాదులను విడదుల చేసేందుకు కృషి చేసిందని దానిని ఎవరూ మర్చిపోలేరని ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కాంగ్రెస్ ను కోరితే…కాంగ్రెస్ బీజేపీ -మోదీని టార్గెట్ చేసిందన్నారు. దీనిఫలితంగానే భారత్ లో పెద్ద పెద్ద నగరాల్లో టెర్రరిస్టుల నెట్ వర్క్ విస్తరించిందని మండిపడ్డారు.