Online Rummy : ఆన్ లైన్ రమ్మీకి బానిసై, నష్టం రావడంతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

ఆన్ లైన్ రమ్మీ ఎంతమందికి డబ్బులు తెచ్చిపెట్టిందో చెప్పలేం కాని.. కొందరి ప్రాణాలను మాత్రం బలితీసుకుంటోంది.

  • Written By:
  • Publish Date - June 7, 2022 / 04:31 PM IST

ఆన్ లైన్ రమ్మీ ఎంతమందికి డబ్బులు తెచ్చిపెట్టిందో చెప్పలేం కాని.. కొందరి ప్రాణాలను మాత్రం బలితీసుకుంటోంది. చెన్నైలోని మణలి పుదునగం లో ఐటీ ఉద్యోగిని అయిన భవానీ ఆన్ లైన్ రమ్మీ ఆడింది. దానికోసం అప్పు కూడా చేసింది. డబ్బులు వస్తాయన్న ఆశతో, నమ్మకంతో ఎంత ఆడినా.. లాభం రాలేదు సరికదా.. పెట్టిన పెట్టుబడంతా పోయింది. దీంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.

చెన్నై లోని మణలి పుదునగం కి చెందిన భాగ్యరాజ్.. ఆరేళ్ల కిందట భవానీని పెళ్లి చేసుకున్నాడు. భాగ్యరాజ్ ప్రైవేట్ కంపెనీలోను, భవానీ ఐటీ సంస్థలోనూ పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భవానీ ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారడంతో కుటుంబ సభ్యుల దగ్గర ఆరు నెలల కిందట రూ.3 లక్షలను అప్పుగా తీసుకుంది. అక్కడితో ఆగకుండా తన దగ్గరున్న 20 సవర్ల బంగారు నగలను కూడా తాకట్టు
పెట్టింది.

అప్పుగా తీసుకున్న మొత్తంతోపాటు, బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో ఆన్ లైన్ రమ్మీ ఆడింది. కానీ అందులో నష్టాలు వచ్చాయి. ఆమె తీరుపై భర్తతోపాటు, తల్లిదండ్రులు కూడా ఆగ్రహించినా భవానీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి స్నానానికి అని వెళ్లిన భవానీ బాత్రూమ్ లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జూదానికి అలవాటుపడి బానిసలైన వారు ఎంతోమంది ఉన్నారు. దీనికోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయినవారు ఎందరో. అలాంటివారిలో కొందరు గుండె దిటవు చేసుకుని.. దీనంగా బతుకు వెళ్లదీస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక, బాధను అనుభవించే శక్తి లేక ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటివి ఎంతమాత్రం మంచిది కాదు. డబ్బు పోగొట్టుకున్నంతమాత్రాన సర్వం పోగొట్టుకున్నట్టు కాదు. దానికోసం ప్రాణాలు తీసుకోవడం అస్సలు సరికాదంటున్నారు మానసిక నిపుణులు.