XPoSAT Success : కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ ఘన విజయంతో ప్రారంభించింది. సోమవారం ఉదయం 9:10 గంటలకు తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో (XPoSat) నింగిలోకి దూసుకెళ్లింది. ‘‘PSLV-C58 వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని 6 డిగ్రీల వంపుతో 650 కి.మీ.ల కక్ష్యలో ఖచ్చితంగా ఉంచగలిగింది’’ అని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ప్రయోగం సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. PSLV-C58 వాహక నౌకలో 480 కిలోల బరువున్న XPoSat ఉపగ్రహంతో పాటు తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్ బహిర్గతం చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
- XPoSAT అంటే ‘ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్’.
- ఈ ఉపగ్రహ ప్రయోగం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే దీని ద్వారా పాలపుంతలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలపై అధ్యయనం చేస్తారు.
- ఈ ఉపగ్రహం ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీలాగా సమాచారాన్ని సేకరించి ఇస్రోకు పంపుతుంటుంది.
- ఖగోళం నుంచి భూమి వైపుగా ప్రసరించే మిస్టీరియస్ కాస్మిక్ కిరణాల గుట్టును కూడా విప్పుతుంది.
- గతంలో అమెరికా మాత్రమే ఈ తరహా ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
- అమెరికా పంపిన ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ శాటిలైట్ పేరు NASA IXPE.
- ఇస్రో XPoSat ఉపగ్రహ ప్రయోగం కోసం రూ.250 కోట్లు ఖర్చు కాగా.. 2021 సంవత్సరంలో NASA నిర్వహించిన IXPE ప్రయోగం కోసం ఏకంగా రూ.1500 కోట్లు ఖర్చయ్యాయి. అంటే చాలా తక్కువ ఖర్చులో మన ఇస్రో అదే తరహా ప్రయోగాన్ని చేయగలుగుతోంది.
- NASA IXPE శాటిలైట్ జీవితకాలం కేవలం రెండేళ్లే.
- మన ఇస్రో పంపిన XPoSat ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు.
Also Read: US vs Houthi : అమెరికా ఎటాక్.. 10 మంది హౌతీ మిలిటెంట్లు హతం