ISROs 100th Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న 100వ ప్రయోగం చేసింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ప్రయోగం విజయవంతంగానే జరిగినప్పటికీ, ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేదు. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు జనవరి 29 నుంచి ఇప్పటివరకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Also Read :CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
ఎందుకు ఫెయిల్ అయింది ?
ఎన్‌వీఎస్-02 శాటిలైట్‌లో ఉన్న ఇంజిన్లు మొరాయించడం వల్లే, దాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపలేకపోయారని తెలిసింది. ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది. ‘ఆన్’ మోడ్‌లోకి తేవాల్సి ఉంటుంది. అయితే ఆక్సిడైజర్‌ను శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు పనిచేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్యలో శాటిలైట్ పరిభ్రమిస్తే నేవిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు పనికిరాదు. శాటిలైట్ ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారతదేశ స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలో ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం చాలా ముఖ్యమైంది.
Also Read : Health Tips : రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకుండా నిద్రపోతున్నారా? ఈ సమస్యలు రావచ్చు.!
ఏమిటీ ఎన్‌వీఎస్-02 శాటిలైట్ ?
ఎన్‌వీఎస్-02.. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థతో కూడిన శాటిలైట్. దీన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలే తయారు చేశారు. భారతదేశం అభివృద్ధి చేసిన కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఈ శాటిలైట్ భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలకు ఉపయోగపడుతుంది. మన దేశ విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలను తీరుస్తుంది. భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను ఇది అందిస్తుంది. ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించే కెపాసిటీని కలిగి ఉంది.