India Moon Base : చంద్రయాన్-3 మిషన్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన ల్యాండర్, రోవర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన డేటాతో తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రయాన్-3లో అమర్చిన అన్ని శాస్త్రీయ పరికరాల నుంచి అందిన సమాచారంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందం సంతృప్తిగా ఉందన్నారు. రోవర్ పంపించిన డేటాకు సంబంధించిన విశ్లేషణ కొనసాగుతోందని, దీనికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని చెప్పారు. ‘‘చంద్రయాన్-2 ఒక పెద్ద గుణపాఠం. ఈ మిషన్ లో ఎక్కడ, ఎలాంటి తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చంద్రయాన్-2 ఎంతో సహాయపడింది. అదే చంద్రయాన్-3 సక్సెస్ కు బాటలు వేసింది’’ అని తెలిపారు.
Also read : Mindspace Buildings Demolition : మాదాపూర్ మైండ్ స్పేస్ లో క్షణాల్లో రెండు భారీ భవనాలు కూల్చివేత..ఎందుకంటే..!
చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను సంప్రదించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సోమనాథ్ తెలిపారు. ఒకవేళ అవి రీయాక్టివేట్ అయితే.. మరిన్ని ప్రయోగాలు చేయడం ద్వారా ఇంకా కొత్త సమాచారాన్ని సేకరించే ఛాన్స్ ఉంటుందని వివరించారు. ‘‘మానవాళి భూమిని దాటి ప్రయాణించాలంటే.. చంద్రుడు, అంగారకుడు వంటి వాటిపై స్థావరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మరిన్ని గ్రహాలపైకి ఈజీగా వెళ్లొచ్చు. భారతీయులు తప్పనిసరిగా చంద్రుడు, అంగారకుడిపై స్థావరాన్ని కలిగి ఉండాలి’’ అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (India Moon Base) తెలిపారు.