Drone Attack : ఓ వైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై యెమన్ హౌతీ మిలిటెంట్లు దాడి చేస్తుండగా.. మరోవైపు అరేబియా సముద్రంలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందిన వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’ లైబీరియా జెండాతో భారత్‌కు వస్తుండగా గుజరాత్ తీరంలో దానిపై డ్రోన్ దాడి(Drone Attack) జరిగింది. దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. కానీ నౌకకు కొంత నష్టం వాటిల్లింది.
We’re now on WhatsApp. Click to Join.
గుజరాత్‌లోని వెరావల్ తీరానికి నైరుతి దిశగా దాదాపు 200 కి.మీ దూరంలో, పోర్‌బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న భారత నేవీ.. వెంటనే గస్తీ నౌక ‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. వాణిజ్య నౌకలో మంటలను ఆర్పేసింది. దీంతో నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తోందని భారత నేవీ తెలిపింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
Also Read: Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 20వేల మంది సామాన్య పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ క్రియేట్ చేస్తున్న ఈ రక్తపాతాన్ని నిరసిస్తూ యెమన్ హౌతీ మిలిటెంట్లు ఎర్రసముద్రం మీదుగా వెళ్లే అన్ని ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఓడ రేవులు మూతపడ్డాయి. చాలావరకు ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకా వాణిజ్యం ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో ఈజిప్టు మీదుగా ఇజ్రాయెల్‌కు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఆర్మీ.. హమాస్, హిజ్బుల్లా, యెమన్ హౌతీల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆర్మీగా పేరుగాంచిన ఇజ్రాయెల్.. 75 రోజులుగా యుద్ధం చేస్తున్నా గాజాపై పట్టు సాధించలేకపోయింది.