Bangladesh : బంగ్లాదేశ్ కోర్టు ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌కు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపర్చారని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్‌లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు.
Read Also: Operation Kagar : కర్రెగుట్ట కొండ పై త్రివర్ణ పతాకం
లాల్‌డింగి మైదానంలో అక్టోబర్ 25న జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఒక దశలో అతని తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాస్ భద్రతపై భారత్ పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నిసార్లు న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఎట్టకేలకు బుధవారం ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించింది.
చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగ్రణ్ జోటె అనే సంస్థకు దాస్ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ మైనార్టీల హక్కులు,భద్రత విషయంలో పనిచేస్తుంది. ఆ దేశంలో మైనార్టీల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది.