Yogi: యోగి బీజేపీకి బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తొలి నుంచీ బీజేపీ కాదు. తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న‌దొక ప్ర‌త్యేక సామ్రాజ్యం. హిందూ యువ‌వాహిని పేరుతో 125 నియోజ‌క‌వ‌ర్గాల్లో యోగి సైన్యం ప‌నిచేస్తుంది.

  • Written By:
  • Publish Date - January 25, 2022 / 10:17 AM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తొలి నుంచీ బీజేపీ కాదు. తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న‌దొక ప్ర‌త్యేక సామ్రాజ్యం. హిందూ యువ‌వాహిని పేరుతో 125 నియోజ‌క‌వ‌ర్గాల్లో యోగి సైన్యం ప‌నిచేస్తుంది. బిస్త్ అనే క్ష‌త్రియ కులంలో ఉత్త‌రాఖండ్ లో జ‌న్మించిన అజ‌య్ మోహ‌న్ బిస్త్ తొలి నుంచీ హిందూత్వ వాది. స‌న్యాసి. గోర‌ఖ్ పూర్ మ‌ఠం అధిప‌తి యోగి అవైద్య‌నాథ్ శిష్య‌రికంతో పాటు ఆయ‌న రాజ‌కీయ‌, ఆధ్యాత్మిక‌, మ‌ఠ వార‌స‌త్వాన్ని కూడా అందుకున్నారు. 1933లో ఆవిర్భ‌వించిన హిందూమ‌హాస‌భ‌లో ముఖ్య‌నేత‌గా కొన‌సాగుతున్న అవైద్య‌నాథ్ 1990వ సంవ‌త్స‌రంలో బీజేపీలో త‌న పార్టీని విలీనం చేశారు. అయోధ్య‌లో రామ‌మందిరం కోసం బీజేపీ సీరియ‌స్ గా ఫైట్ చేస్తున్న కార‌ణంగా 1980 వ ద‌శ‌కం నుంచి హిందూమ‌హాస‌భ‌, బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తోంది. ఆ త‌ర్వాత ద‌శాబ్దానికి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. విలీనం త‌ర్వాత 1996లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గోర‌ఖ్ పూర్ నుంచి అవైద్యానాథ్ బీజేపీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆధిత్య‌నాథ్ 1998లో బీజేపీ ఎంపీగా అదే సీటు నుంచి వ‌రుస‌గా ఐదు సార్లుగా బీజేపీ ఎంపీ అయ్యారు. బీజేపీ ఎంపీగా ఉండ‌గ‌నాఏ హిందూమ‌హా స‌భ పార్టీని మ‌రిచిపోకుండా…

హిందూ యువ‌వాహిని పేరుతో ఒక యువ‌జ‌న సంస్థ‌ను స్థాపించారు. ఇప్పుడు తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని 125 స్థానాల్లో యువ‌వాహిని కార్య‌క‌ర్త‌లు యోగికి సైన్యంలా పేనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ పేరు పెద్ద‌గా వినిపించ‌దు. యువ‌వాహిని చెప్పిన‌ట్లు బీజేపీ న‌డుచుకోవాల్సిందే. యోగి బీజేపీ ఎంపీ అయిన‌ప్ప‌టికీ దాదాపు ప‌దేళ్ళ పాటు బీజేపీ నేత‌ల‌ను లెక్క‌చేసేవారు కాదు. అయితే ఎల్ కె అద్వానీ వంటి బీజేపీలోని రైటిస్ట్ నాయ‌కుల‌కు, ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌కు యోగి అంతే ఇష్టం. బీజేపీ నేత‌ల కంటే అతిగా హిందూత్వ వాదానికి క‌ట్టుబ‌డి ఉండ‌టం, అస‌లు ముస్లింలు అంటే గిట్ట‌క‌పోవ‌డ‌మే యోగికి ఆర్ ఎస్ ఎస్ ప్రాధాన్య‌మిచ్చేది. హిందూ మ‌హా స‌భ‌లో హిందూయేత‌ర‌ల‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌డానికి అక్క‌డి ముఖ్య నేత‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డం తోనే ఆ పార్టీ నిల‌దొక్కుకోలేక‌పోతున్న‌ద‌ని భావించిన శ్యామాప్ర‌సాద ముఖ‌ర్జీ వారితో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యుల‌తో సంప్ర‌దించి వారి స‌హకారంతో భార‌తీయ జ‌న‌సంఘ్ అనే పార్టీని 1951లో స్థాపించారు.

1990లో తిరిగి హిందూ మ‌హాస‌భ బీజేపీలోనే విలీన‌మ‌యింది. అది వేరే సంగ‌తి. బీజేపీలో చేరి ఎంపీ అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినాయ‌క‌త్వానికి ఎప్పుడూ లొంగి ఉండ‌లేదు యోగి. అనేక ఎన్నిక‌ల్లో త‌న‌వారికి సీట్లు ఇవ్వ‌క‌పోతే బీజేపీ అభ్య‌ర్థుల మీదే యువ‌వాహిని కార్య‌క‌ర్త‌ల‌ను నిల‌బెట్టి ఓడించారు. అయిన‌ప్ప‌టికీ ఆర్ ఎస్ ఎస్ కు ఇష్టుడిగా మారిన యోగి ఆదిత్య‌నాథ్ 1917లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ స్టార్ కేంపెయిన‌ర్ అయ్యారు. బీజేపీ గెలిచిన మ‌ర్నాడే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. యూపీలో గ‌త ఎన్నిక‌ల్లో ముస్లింల‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా బీజేపీ కేటాయించ‌లేదు. కేంద్రంలోని బీజేపీ కేబినెట్ లో ముస్లిం మంత్రులున్నారు. అయిన‌ప్ప‌టికీ యూపీ అసెంబ్లీలో క‌నీసం ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేరు. ఈ ఐదేళ్ళ‌లో యోగి పాల‌న‌లో యూపీ కొన్ని మంచి ప‌నులు, కొన్ని చెడ్డ ప‌నులూ జ‌రిగాయి. గ‌తం మాదిరిగానే 300 సీట్లు తెచ్చుకోవ‌డానికి బీజేపీ ప‌డ‌రాన్ని పాట్లు ప‌డుతోంది. ఇది వేరే సంగ‌తి. అయితే ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన యోగి ఎంపీగానే యూపీకి సీఎం అయ్యారు.

త‌ర్వాత ఎంపీ సీటుకు రాజీనామా చేసి కౌన్సిల్ లో స‌భ్యుడిగా ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. బీజేపీతో సంబంధం లేకుండా నేరుగా ఆర్ ఎస్ ఎస్ అధినాయ‌క‌త్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సిస‌లైన హిందుత్వ వాదిగా చ‌లామ‌ణి అవుతున్న యోగితో మోడీకి ఆయ‌న స్నేహితుడి అమిత్ షాకు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. యూపీలో అత్య‌ధిక మెజారిటీ తెచ్చుకుని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయితే మోడీకి కూడా పోటీ కావ‌చ్చ‌నేది వారి భ‌యం. మోడీ త‌ర్వాత అమిత్ షా ప్ర‌ధాని అవుతారంటూ బీజేపీలో ప్ర‌చారం సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో యోగి యూపీలో రెండోసారి సీఎం అయితే ఆర్ ఎస్ ఎస్ దృష్టిలో మ‌రింత ఎత్తు ఎదిగిపోతాడు. అందుకే యోగిని అయోధ్య నుంచి అసెంబ్లీకి పోటీ చేయ‌డానికి అమిత్ టీమ్ అంగీక‌రించ‌లేదు. త‌న మ‌ఠం ఉన్న గోర‌ఖ్ పూర్ నుంచే పోటీచేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం గోర‌ఖ్ పూర్ ఏరియాలో యోగి ప‌రిస్థితి బాగాలేద‌న్న‌ది టాక్. అందుకే అక్క‌డి నుంచి పోటీచేస్తే, యోగి ఓడిపోతే సంతోషించాల‌ని మోడీ, అమిత్ షా టీమ్ భావిస్తోంది. కాని యూపీలో పార్టీ బ‌లంగా ఉంటేనే వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి బ‌లం పెరుగుతుంది. యూపీలో త‌గ్గితే ఢిల్లీలోనూ త‌గ్గుతుంది. యూపీలో బ‌లం పెంచుకుని, 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తే యోగి పోటీ అవుతాడ‌నే భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుక యోగిని క‌చ్చితంగా గెలిచే అవ‌కాశం ఉన్న అయోధ్య సీటు ఇవ్వ‌కుండా ఆయ‌న మ‌ఠం ఉన్న గోర‌ఖ్ పూర్ కి పంపించార‌నే వాద‌న వినిపిస్తోంది.