Khalistan Movement : ఖలిస్తాన్ ఉద్యమం బతికే ఉందా?

ఎప్పుడో దశాబ్దాల క్రితం అంతమైపోయిందని అనుకున్న ఖలిస్తాన్ (Khalistan) వేర్పాటు ఉద్యమం ఇంకా బతికే ఉందా అన్న అనుమానం దేశంలో అందరికీ కలవరం పుట్టిస్తోంది.

  • Written By:
  • Updated On - September 21, 2023 / 01:05 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Khalistan Movement : ఇండియా, కెనడా దౌత్య సంబంధాల మధ్య దాదాపు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది రాను రాను కెనడా, అమెరికా, ఫ్రాన్స్ ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు కలిసి ఇండియాను వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ దేశాలతో మన దేశం సంబంధాల విషయం ఎలా ఉన్నా, ఎప్పుడో దశాబ్దాల క్రితం అంతమైపోయిందని అనుకున్న ఖలిస్తాన్ (Khalistan) వేర్పాటు ఉద్యమం ఇంకా బతికే ఉందా అన్న అనుమానం దేశంలో అందరికీ కలవరం పుట్టిస్తోంది.

జి20 సమావేశాలకు పైన పేర్కొన్న దేశాల ముఖ్య నేతలు అందరూ భారతదేశానికి వచ్చారు. ఆ సమావేశాల సంబరాలు ఇంకా ముగియనేలేదు. ప్రపంచ దేశాలతో మన దేశానికి ఉన్న సత్సంబంధాలు, సాన్నిహిత్యం పట్ల మన ఆనందం అనేక రూపాల వ్యక్తం అవుతూనే ఉంది. ఇంతలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడో కెనడా పార్లమెంటులో బాంబు పేల్చారు. కెనడా పౌరసత్వం ఉన్న ఖలిస్తాన్ (Khalistan) వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారతీయ గూఢచారి సంస్థకు చెందిన వ్యక్తులు ఖతం చేశారని ఆయన ఆరోపణ. దీనిపైన కెనడా ప్రధాని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని తమ పార్లమెంట్ లో ప్రకటించారు. వాటిని అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అందజేసినట్లు కూడా చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ వార్తను భారతదేశం సంపూర్ణంగా ఖండించింది.

ఈ నేపథ్యంలో భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన వార్ జరుగుతూనే ఉంది. ఖండన మండనలు సాగుతూనే ఉన్నాయి. ఇంతలో భారతదేశం కెనడాలో ఉన్న భారతజాతి సంతతికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ రాయబార కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేయాలని కెనడాలో ఉన్న భారతజాతి సంతతిని, విద్యార్థులతో సహా అందరినీ భారత్ ఆదేశించి. దీనికి కెనడా తమ దేశ వాసులకు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసినట్టు వచ్చిన వార్తలు ఆధారం. అయితే తాము 2021 లోనే ఇది జారీ చేసినట్లు కెనడా చెప్తోంది.

ఇరుదేశాల మధ్య రోజూ పెరుగుతున్న ఘర్షణ వాతావరణం ఒక ఎత్తు. ఖలిస్తానీ వేర్పాటు వాది హరదీప్ సింగ్ హత్య జరగడం ఒక ఎత్తు. ఈ వార్తలు ఎలా ఉన్నా, భారతదేశాన్ని కలచివేసే అసలు విషయం ఏమిటంటే, ఎప్పుడో భింద్రన్ వాలే కాలంలోనే అంతమైపోయిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా సజీవంగా ఉందా, అది విదేశాల్లో ప్రాణం పోసుకుందా, అది భారతదేశానికి, భారతదేశ ఐక్యతకు వ్యతిరేకంగా రణ తంత్రాలు రచిస్తోందా అన్న ఊహాగానాలు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దీనికి తోడు ఇటీవల సిక్కులకు న్యాయం (Sikhs for Justice) అనే ఉద్యమానికి నాయకుడైన గురుపత్వంత్ సింగ్ ప్రారంభించిన ఒక ప్రచార ఉద్యమం మరింత కలవరపాటుకు గురిచేసింది. భారతీయ హిందువులు కెనడాను వదిలి వెళ్లాలని ఆ ఉద్యమం ఉద్దేశం. దీనిపైన ఇప్పటికే ఆన్లైన్ యాక్టివిటీ చాలా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమం బతికే ఉందని, అది భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ గడ్డమీద కుట్రలు పన్నుతోందనే అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇప్పుడు ఈ దేశానికి అనుకోని తలనొప్పి ఇదొకటి మొదలైంది. అసలే అనేక సమస్యలతో ఆందోళనలతో అతలాకుతలమవుతున్న భారతదేశం మరి ఈ కొత్త సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Also Read:  Leadership Crisis : తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం?