Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?

Delhi Railway Station Stampede : మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని జయప్రకాశ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు

Published By: HashtagU Telugu Desk
Is That Rumor The Reason Fo

Is That Rumor The Reason Fo

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన భయంకరమైన తొక్కిసలాట (Delhi Stampede) దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు (18 died) కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని జయప్రకాశ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం, రైళ్ల ఆలస్యమే కాకుండా కొన్ని రద్దయినట్టు వచ్చిన పుకారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాత్రి వేళ ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్ల కోసం వేచిచూస్తున్న వేలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఒక్క రైలును చేరుకోవాలని ప్రయత్నించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ ఘటన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 14, 15వ నంబర్ ప్లాట్‌ఫామ్లపై జరిగింది. రైల్వే శాఖ భక్తుల రద్దీని అదుపు చేయడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, అనుకున్నట్లు అవి సమయానికి అందుబాటులో లేకపోవడం పెను విషాదానికి దారి తీసింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయనే పుకారు సందర్బంగా భారీగా చేరుకున్న భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తాము ఇక ప్రయాణం చేయలేమనే భయంతో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కేందుకు 12, 13వ ప్లాట్‌ఫామ్ల వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా 14వ ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు.

ఇప్పటికే భక్తులతో నిండిన 14వ ప్లాట్‌ఫాం మీద మరో వేలాది మంది వచ్చి చేరడంతో అక్కడ భారీ గందరగోళం నెలకొంది. తమ వద్ద ఉన్న సామాన్లు, చిన్న పిల్లలను ఎత్తుకుని పరుగెత్తే క్రమంలో కొందరు స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల మీద కిందపడిపోయారు. వారి మీద మరికొందరు పడిపోవడంతో కిందపడి ఉన్న వారిని తొక్కుకుంటూ జనాలు ముందుకు సాగారు. కేవలం 15-20 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న కొందరు ప్రయాణికులు అపస్మారక స్థితికి చేరుకోగా, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బట్టలు, బ్యాగులు, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడ జరిగిన తీవ్రతను తెలియజేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర సంతాపం తెలిపారు.

  Last Updated: 16 Feb 2025, 07:43 AM IST