Site icon HashtagU Telugu

Modi Strategy? : ఒకేసారి ఎన్నికలు వెనక మోదీ వ్యూహం అదేనా?

Is That Modi's Strategy Behind Simultaneous Elections

Is That Modi's Strategy Behind Simultaneous Elections

By: డా. ప్రసాదమూర్తి

Modi New Strategy : ” ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు” ఈ మాట మరోసారి పెను నినాదంలా దేశమంతా మారుమోగడం మొదలైంది. మనకు తెలుసు, ప్రతిపక్షాలు సంధించే అస్త్రాలు ఎన్ని ఉన్నా వాటికి సమాధానంగా ఒకే ఒక్క వ్యూహం మోదీని (Modi) కాపాడే అచంచల కవచంగా ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నట్టుండి బాబు పేల్చారు. అదే సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఉంటాయని ఆయన పేల్చిన బాంబు తాలూకు ప్రకంపన. ఇక దేశమంతా చర్చ మొదలైంది. ఎందుకు.. ఏమిటి.. ఇంత అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదో పెద్ద వ్యూహమే ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దేశమంతా తన దృష్టి ఒకవైపుకు మరల్చడమే ఆ వ్యూహం కావచ్చు.

పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగిశాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరగాలి. మరి ఈ మధ్యలో అత్యవసర సమావేశం కావడం అంటే ఏదో కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ నిర్ణయం ఏమిటా అన్నదే ఇప్పుడు చర్చ. కొందరు ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే విషయం మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని, మరికొందరు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారని ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారు. మనకు తెలుసు మణిపూర్ మంట ఇంకా చల్లారనే లేదు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కానే లేదు. మహిళా మల్లయోధుల ఆరోపణల మీద ప్రభుత్వం స్పందించనేలేదు. ఈ విషయాలన్నింటిమీద ఒకపక్క ఉన్నత న్యాయస్థానంలో జస్టిస్ చంద్ర చూడ్ లాంటి న్యాయమూర్తుల నుంచి తీవ్రమైన ఎదురుదాడి ప్రభుత్వం ఎదుర్కుంటోంది. ఇంతలో అదానీ సంస్థ అక్రమాదాయాల డొంకంతా కదిలింది. మరి ఇన్ని సమస్యలు ఒకపక్క దేశాన్ని కుదిపివేస్తుంటే ఎలా తట్టుకోవాలి? అందుకే దేశాన్ని వీటన్నిటి నుంచి దృష్టి మరల్చి ఒకే విషయం మీద కేంద్రీకృతం చేస్తే సరిపోలేదా అన్నది ఏలిన వారి ఎత్తుగడ కాబోలు.

దేశంలో జమిలి ఎన్నికల మాట ప్రభుత్వం ఎప్పటినుంచో పాడుతున్న పాటే. ఈ విషయంలో లా కమిషన్ కు కేంద్రం నివేదించడం, దీనిపై లా కమిషన్ 79వ నివేదికలో సిఫార్సులు చేయడం మనకు తెలుసు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ కోసం లా కమిషన్ కేంద్రాన్ని అడిగినట్టు జూలై 27న రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేక అంశాలను పట్టుకొని దాడికి దిగిన ఈ తరుణంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే ఎజెండాను ముందుకు తీసుకొస్తే సరిపోతుంది కదా అని మోదీ (Modi), ఆయన టీం రచించిన గొప్ప వ్యూహం కావచ్చు. సాధ్యాసాధ్యాల మాట దేవుడెరుగు. రాష్ట్రాలతో పాటు దేశమంతాఒకేసారి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుంది. దానికి ఉభయ సభల్లో అవసరమైన మద్దతు కూడగట్టుకోవాలి. ఇదంతా జరిగినా జరగకపోయినా కాలమైతే ముందుకు జరుగుతుంది కదా. అలా ముందుకు జరిగిన కాలంలో కొన్ని విషయాలు వెనక్కి, కొన్ని విషయాలు ముందుకి వస్తాయి కదా. దేశమంతా అలా ముందుకీ వెనక్కీ ఊగిసలాడే క్రమంలో ఎన్నికలు రానే వస్తాయి. అదే అమృతకాలం అంటే అంతరార్థం.

ఒకే దేశం ఒకే మతం ఒకే రాజ్యాంగం ఒకే సివిల్ కోడ్ ఒకే వర్ణం ఒకేసారి ఎన్నికలు.. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ స్వప్నాలు. దేశాన్ని హిందూ దేశంగా మలచి, దేశంలో ఒకే న్యాయ సూత్రాలను ఒకే మతం ఆధిపత్యం కింద అమలు చేయాలన్న ఆర్ఎస్ఎస్ అనాది కోరికను బిజెపి తీర్చడానికి కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ ఒకే ఒకే నినాదం ముందు బలాదూర్ కావాల్సిందే అన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆలోచన కావచ్చు. అందుకే ఇప్పుడు ఆకస్మికంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు అందరికీ అర్థమవుతోంది. ఉన్న సమస్యలను పరిష్కరించడం కంటే ఆ సమస్యల నుండి పలాయనం చిత్తగించడానికి, మరికొన్ని కొత్త సమస్యలను సృష్టించి దేశాన్ని ఒక భ్రమావరణంలో గింగిరాలు కొట్టించడం వెనక ఉన్న మహా వ్యూహంగా ఈ ఆకస్మిక సమావేశాలను భావించాలి. జి20 శిఖరాగ్ర సమావేశం ముగిసిన వెంటనే ఈ వ్యూహం అమలవుతుంది. మరి ఈ వ్యూహాన్ని ప్రతిపక్ష కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Also Read:  YS Sharmila : వైఎస్ షర్మిల తన అన్న పై దండయాత్ర చేస్తుందా?