యూపీ కాంగ్రెస్ లో ప్రియాంక శ‌కం

ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రియాంక‌గాంధీ వ్యూహాలు ర‌చిస్తున్నారు. మూడు ద‌శాబ్దాలుకు పైగా యూపీ అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఒప్పుడు యూపీ రాష్ట్రాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉండేది.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 12:21 PM IST

ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రియాంక‌గాంధీ వ్యూహాలు ర‌చిస్తున్నారు. మూడు ద‌శాబ్దాలుకు పైగా యూపీ అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఒప్పుడు యూపీ రాష్ట్రాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉండేది. కానీ, గ‌త 32 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అక్క‌డ స్థానంలేకుండా పోయింది. కనీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా పోయే దుస్థితికి వెళ్లింది. అసెంబ్లీకి 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం 7 స్థానాల‌కు ప‌రిమితం అయింది. అలాగే 2019లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక స్థానం మాత్ర‌మే పొంద‌క‌లిగింది. ఇంత‌టి దీన‌స్థితిలో ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావ‌డం ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రి త‌ర‌మూ కాదు. పైగా అక్క‌డ ఎస్పీ, బీఎస్పీ పార్టీలు బ‌లంగా ఉన్న విప‌క్ష పార్టీలు. వాటిని కాద‌ని కాంగ్రెస్ పార్టీ వైపు ప్ర‌జ‌లు మొగ్గుచూప‌డం ఇప్ప‌ట్లో జ‌ర‌గే ఛాన్స్ లేదు.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్రియాంక యూపీలోని స‌గం భాగానికి ఇంచార్జిగా ఉన్నారు. మ‌రో స‌గం రాష్ట్రానికి జ్యోతిరాథిత్య ఇంచార్జి. ఇద్ద‌రూ ఎప్పుడూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల చెప్పుకోద‌గ్గ పోరాటాలు చేయ‌లేదు. ప్రియాంక యూపీ ప్ర‌జ‌ల‌కు దాదాపుగా దూరంగా ఉన్నార‌ని చెప్పొచ్చు. ఇంకా కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు ఉండ‌గా, ఇప్పుడు. హ‌ఠాత్తుగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ప్రియాంక వ‌చ్చారు విరోచిత పోరాటాలు అణ‌గారిన వ‌ర్గాల కోసం కాంగ్రెస్ చేస్తుంద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రియాంక చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు యూపీలోని ల‌కీంపూర్ ఖ‌రీ ఘ‌ర్ష‌ణ కేంద్రం అయింది. అక్క‌డ అక్టోబ‌ర్ 4న ఎనిమిది మంది ఘ‌ర్ష‌ణ‌ల్లో చ‌నిపోయారు. వాళ్ల‌లో న‌లుగురు రైతులు ఉన్నారు. బీజేపీకి చెందిన మంత్రి కుమారుడు రైతుల మీదుగా కారును డ్రైవ్ చేశాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌. అందుకే, ఆ సంఘ‌ట‌న‌పై వెంట‌నే ప్రియాంక ప్ర‌తిస్పందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి రైతు కుటుంబాల‌ను పరామ‌ర్శించాల‌ని హుటాహుటిన ల‌క్నో విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఆ విష‌యం తెలుసుకున్న. యూపీ పోలీసులు ఆమెను విమానాశ్ర‌యం గేటు వ‌ద్ద అడ్డుకున్నారు. వెనుక గేటు నుంచి ఆమె కారులో ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో పోలీసుల‌కు, ప్రియాంక కు మ‌ధ్య జ‌రిగిన సీన్ సినిమా క్లైమాక్స్ ను త‌ల‌పించింది. దాదాపు 60 కిలోమీట‌ర్లు గ్రామీణ ప్రాంత రోడ్డ‌ల‌లోకి వెళ్లిన త‌రువాత పోలీసులు ప్రియాంక‌ను క‌స్ట‌డీలోకి తీసుకోగ‌లిగారు. నేష‌న‌ల్ హైవే 24కు స‌మీపంలోని సితాపూర్ వ‌ద్ద ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్ కు ఆమెను త‌ర‌లించారు.

అక్క‌డే హౌస్ అరెస్ట్ చేయ‌డంతో 5వ తేదీ రాత్రంతా అక్క‌డే ఉండిపోయారు. రైతు కుటుంబాల‌ను పరామ‌ర్శించ‌డానికి అనుమ‌తి ఇచ్చే వ‌ర‌కు పోరాటం చేశారు. ఆమె ప‌ట్టుద‌ల‌ను చూసిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంతో ముందుకు వ‌చ్చారు. రైతు కుటుంబాల‌ను పరామ‌ర్శించిన త‌రువాత ల‌క్నోకు తిరిగి వెళ్లిన ఆమె యూపీ స‌ర్కార్ తీరుకు నిర‌స‌న‌గా మూడు రోజుల పాటు ద‌ళిత కుటుంబాలు ఉండే ప్రాంతాల‌కు వెళ్లి గాంధీయ మార్గాన్ని ఎంచుకుని చీపురుతో ఊడ్చే కార్య‌క్రమాన్ని చేపట్టింది. యూపీ అంత‌టా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆమెను అనుస‌రించి ద‌ళితులు నివాసిత ప్రాంతాల్లో చీపుర్లు పట్టారు. ప్రియాంక రాజ‌కీయంలో ఇదో విజ‌య ఘ‌ట్టంగా కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు, రాబోయే ఎన్నిక‌ల‌కు ఇలాంటి కార్య‌క్ర‌మాలు కాంగ్రెస్ కు బాగా అనుకూలిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

క్యాడ‌ర్ లో ఉత్సాహం నింప‌డంతో పాటు విస్తృత ప్ర‌చారం చేయ‌డానికి నాలుగు బుక్ లెట్ లను పంపిణీ చేశారు. వాటిలో ఒక‌దానిలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు వివ‌రాలు, కాంగ్రెస్ పై దుష్ప్ర‌చారం జ‌రుగుతోన్న విధానం పొందుప‌రిచారు. ఇక రెండోదానిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భార‌త‌దేశానికి ఎంత ప్ర‌మాదమో తెలియ‌చేస్తూ కొన్ని ఘ‌ట్టాల‌ను వివ‌రించారు. కోవిడ్ 19 స‌మ‌యంలో భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రించిన తీరును మూడో బుక్ లెట్ లో ఉంచారు. ఇక నాలుగో బుక్ లెట్ లో యూపీ స‌ర్కార్ ఎలాంటి అవినీతి చేసిందో తెలియ‌చేస్తూ పొందుప‌రిచారు. ఆ నాలుగు బుక్ లెట్ ల‌ను విస్తృతంగా యూపీలో పంచుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎప్పుడూ ఇలాంటి ప్ర‌య‌త్నం కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా యూపీలో చేయ‌లేదు. ఈసారి ప్రియాంక ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతోన్న యుద్ధ‌ప్రాతిప‌దిక ప్ర‌చారం..2022లో జ‌రిగే ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చుతాయ‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. సో..కాంగ్రెస్ యూపీలో ప్ర‌య‌త్న‌లోపం లేకుండా ప‌నిచేస్తోంద‌న్న‌మాట‌.