పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న తీరును చూసిన ప్రతి భారతీయుడి గుండె కదిలిపోకమానదు. ఎన్నాళ్లు వేచిచూస్తాం? ఎన్నాళ్లు భరించాలి? ఇప్పుడు కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తరిమికొట్టే సమయం వచ్చిందని ప్రజాస్వామ్య భారతదేశం గట్టిగా చెప్పాలి. మాటలు చాలయ్యాయి, మౌనంగా ఉండటం పరోక్షంగా మద్దతు ఇవ్వటమే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ దశలో ‘ఆపరేషన్ అఖండ కశ్మీర్’ అనే ధీటైన చర్యకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం అత్యవసరమైంది.
Pahalgam Terror Attack : అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం – రాజ్ నాథ్ సింగ్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై మన హక్కును ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఇదే కావాలి. అది మన భూభాగం, మన చరిత్రలో భాగం. అంతేగాక, అక్కడి ప్రజలు కూడా శాంతి కోరుతున్నారు, భారతదేశంలో విలీనమవ్వాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు మన సైన్యం, నిఖార్సైన దౌత్యం, దేశ ప్రజల మద్దతుతో POKని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది కేవలం భూభాగ స్వాధీనం కాదు, అది దేశ గౌరవం, ప్రజల భద్రతకు ప్రతీక కావాలి.
ఇప్పుడు తీసుకోని చర్య భవిష్యత్తులో ఇంకెన్ని అమాయకుల ప్రాణాల్ని తీస్తుందో చెప్పలేం. ఎందుకీ ఆలస్యం? దేనికోసం వెయిటింగ్..? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? భారత ప్రజల తలవంచే ఈ ఉగ్రవాద మాయాజాలానికి శాశ్వత Full Stop పెట్టే దిశగా అడుగులు వేయాలి. ఒక్కసారి కశ్మీర్‌ను పూర్తిగా శాంతి ప్రాంతంగా మార్చగలిగితే, దేశ భద్రతకు మాత్రమే కాదు, దేశాభివృద్ధికి కూడా ఇది మైలురాయి అవుతుంది. దేశం ఇప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఉంది. అంతిమంగా, ఇది న్యాయం గెలిచే సమరం కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఇటు కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ సైతం భారతదేశాన్ని ఎవ్వరూ భయపెట్టలేరని, దాడికి తగిన విధంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్నాథ్ హెచ్చరించారు. ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్న, ఆ దోషులను పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడం భారత్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.