USD And INR: ఇక మన రూపాయిదే రాజ్యమా? డాలర్ కు ప్రత్యామ్నాయంగా రూపాయి మారబోతోందా?

  • Written By:
  • Updated On - March 15, 2022 / 12:08 PM IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎవరికి మేలు చేసిందో.. ఎవరికి కీడు చేసిందో ఏమో కాని.. మన రూపాయికి మంచి రోజులు తీసుకువచ్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారంలో చెల్లింపులు చేయాలంటే అమెరికా డాలరే దిక్కు. ఎక్కువ దేశాలు దానినే ఆమోదిస్తాయి. కానీ ఇప్పుడు ఈ యుద్ధం వల్ల రూపాయిని రిజర్వ్ కరెన్సీగా మార్చడానికి సరైన సమయం ఆసన్నమైంది అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్.

అంతర్జాతీయ స్థాయి వాణిజ్యంపై డాలర్ పెత్తనాన్ని ఇప్పటికిప్పుడు తొలగించలేం. దానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. కానీ, రష్యాపై ఇతర దేశాల ఆంక్షల వల్ల.. ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెరిగింది. అందుకే రష్యా-భారత్ మధ్య రూపాయి-రూబుల్ విధానంలో వాణిజ్యం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. మనకు రూపాయి ఎలాగో.. రష్యాకు రూబుల్ అలా. లేదా పాతకాలంలో చేసినట్టుగా బంగారంతో చెల్లింపులు చేసే ప్రతిపాదన కూడా ఉంది.

రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వాడాలంటే దానికి సమయం, సందర్భం కలిసిరావాలి. అది ఇప్పుడు వచ్చిందంటున్నారు ఆర్థికవేత్తలు. అయినా ఈ కల నెరవేరాలంటే.. అంత ఈజీ కాదు. కాకపోతే స్విఫ్చ్
పేమెంట్ సిస్టమ్ పై నిషేధం వల్ల రష్యా ఎటువంటి చెల్లింపులూ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే మన దేశానికి ముడిచమురుతో పాటు మరికొన్ని ఉత్పత్తులను చవకగా అమ్మడానికి రష్యా ప్రయత్నిస్తోంది. దీనికోసం రూపాయి-రూబుల్ విధానంలో చెల్లింపులు చేసుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.

రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఉపయోగిస్తే అంతా లాభమేనా.. ఎలాంటి నష్టమూ ఉండదా అంటే.. ఉంటుంది. ద్రవ్య పరపతి విధానం కష్టమవచ్చు. కానీ తగ్గనున్న లావాదేవీల వ్యయంతో పోలిస్తే ఇబ్బంది ఉండదు. అందుకే రూపాయిని హీరోగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరితే అదే చాలు.