Gyanvapi Lingam: జ్ఞానవాపి జ్యోతిర్లింగమా.. అదెలా? వేదంలో ఉందా?

జ్ఞానవాపి కేసు కొత్త మలుపు తిరగుతోంది. మసీదు స్థానంలో గుడి ఉందన్నది ఇప్పటి వరకు హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణ.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 08:15 AM IST

జ్ఞానవాపి కేసు కొత్త మలుపు తిరగుతోంది. మసీదు స్థానంలో గుడి ఉందన్నది ఇప్పటి వరకు హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణ. అందుకు తగ్గట్టే శివలింగం కూడా కనిపించిందని కోర్టుకు తెలిపారు. బయట ఉన్న నంది చూస్తున్నది మొన్న బయటపడిన శివలింగాన్నే అంటూ ఆధారాలు చూపిస్తున్నారు. అయితే, విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు కొత్త వాదన తీసుకొచ్చింది. అసలు జ్ఞానవాపి ఉన్న క్షేత్రం జ్యోతిర్లింగం అంటూ కొత్త వాదన చేస్తోంది.

దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అందులో కాశీ విశ్వనాథ క్షేత్రం కూడా ఒకటి. ఇప్పటి వరకు ఆ విశ్వనాథుడినే జ్యోతిర్లింగంగా కొలుస్తున్నారు హిందువులు. కాని, ఇప్పుడు దొరికిన లింగమే జ్యోతిర్లింగం అనే అర్ధం వచ్చేలా విశ్వ హిందూ పరిషత్ కొత్త వర్షన్ తెరపైకి తెచ్చింది. కావాలంటే ఆధారాలు కూడా చూపిస్తామంటున్నారు.

ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన మాట ముమ్మాటికీ నిజం. ఒక్క ఈ క్షేత్రమే కాదు.. ఎన్నో ఆలయాలను నేలమట్టం చేసి.. గర్భాలయంలో ఉన్న విగ్రహాలు, లింగాలను ధ్వంసం చేయించి ఎక్కడో పారవేయించాడని అంటారు. అలా ధ్వంసం చేసిన విగ్రహాలు, లింగాల స్థానంలో కొత్త వాటిని పున:ప్రతిష్టించారు. ఇప్పుడు కాశీలో కొలుస్తున్న శివలింగం కూడా కొన్ని శతాబ్దాల క్రితం పున:ప్రతిష్టమేనన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కాని, హిందువులెవరూ దీన్ని అంగీకరించరు. ఇప్పుడు జ్ఞానవాపిలో శివలింగం కనిపించడంతో.. అసలు జ్యోతిర్లింగ క్షేత్రం అదే అన్న వాదన మొదలైంది. పైగా జ్ఞానవాపి బయట నందీశ్వరుడు కనిపిస్తుండడం, ఆ నంది జ్ఞానవాపిలో శివలింగం వైపే చూస్తుండడంతో.. దీని ఆధారంగా అదే జ్యోతిర్లింగం అని నిరూపిస్తామని చెబుతోంది వీహెచ్పీ.