Gay Marriage : సేమ్ సెక్స్ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తారా ? ‘సుప్రీం’ తీర్పు నేడే

Gay Marriage : స్త్రీని స్త్రీ.. పురుషుడిని పురుషుడు పెళ్లి చేసుకోవడాన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటారు.

Published By: HashtagU Telugu Desk
Group 1 Exam Supreme Court TSPSC TGPSC Telangana

Gay Marriage : స్త్రీని స్త్రీ.. పురుషుడిని పురుషుడు పెళ్లి చేసుకోవడాన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటారు. ఈవిధమైన స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వొచ్చా ? ఇవ్వొద్దా ? అనే దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ కు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది మే 11 నుంచి 10 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అయితే స్వలింగ సంపర్కుల వివాహాలకు తాము అంగీకారం తెలుపలేమని కేంద్ర సర్కారు కోర్టుకు తెలిపింది. భారత్ లోని కుటుంబ వ్యవస్థకు సేమ్ సెక్స్ మ్యారేజ్‌లు, హోమో సెక్సువల్ రిలేషన్ షిప్స్ విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘చట్ట ప్రకారం పెళ్లి అనేది పురుషుడు, స్త్రీ చేసుకుంటారు. వారిని భార్యాభర్తలుగా భావిస్తారు. అయితే, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే దాంట్లో ఈ అంశాలు ఉండనే ఉండవు. దీనికి సంబంధించి కేంద్రం పార్లమెంట్ మాత్రమే చట్టం తీసుకురాగలదు’’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర సర్కారు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వాదనలు జరుగుతున్న క్రమంలో సీజేఐ డీవై చంద్రచూడ్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య అంగీకార పూర్వక శృంగారంతో పాటు పలు ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయి’’ అని ఆయన అన్నారు. ‘‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోని జెండర్ అనే పదం చాలా సంక్లిష్టమైనది. ఇక్కడ బయోలాజికల్ మేన్, బయోలాజికల్ వుమన్ అనే నిర్వచనాన్ని వారి మర్మాంగాలకు పరిమితం చేయకూడదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. దేశంలోని మతాల ‘పర్సనల్ లా’ల జోలికి వెళ్లకుండా ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ పిటిషన్లపై జరిగిన తొలిరోజు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు పిటిషనర్ల తరఫున అడ్వకేట్ ముకుల్ రోహత్గీ.. ‘‘రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, 19, 21ల కింద ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వివాహ హక్కులు కల్పించాలి’’ అని (Gay Marriage) కోరారు.

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏమిటి?

మతాంతర, కులాంతర వివాహాలను రిజిస్టర్ చేయడానికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ను తీసుకొచ్చారు. ఈ యాక్ట్ లోని సెక్షన్ 5 ప్రకారం.. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు 30 రోజులు ముందుగానే రిజిస్ట్రార్‌కు తెలియజేయాలి. దీనికి సంబంధించిన నోటీసును మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ బయట అతికిస్తారు.ఈ 30 రోజులలో ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాకపోతే, ఆ పెళ్లిని అనుకున్న తేదీకి రిజిస్టర్ చేస్తారు. అయితే ఒక షరతు ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 4సీ ప్రకారం.. అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు నిండి ఉండాలి.

 Also Read: Olympics: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒలింపిక్స్‌లో ఆడటం కష్టమేనా..? కారణమిదేనా..?

  Last Updated: 17 Oct 2023, 07:35 AM IST