Eastern Army: అనుభవజ్ఞులకే ఆర్మీ చీఫ్ పదవులు!

ఆర్మీ చీఫ్‌ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ "లుక్ ఈస్ట్" పాలసీ అవలంభిస్తోందా ?

  • Written By:
  • Updated On - April 22, 2022 / 02:28 PM IST

ఆర్మీ చీఫ్‌ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ “లుక్ ఈస్ట్” పాలసీ అవలంభిస్తోందా ? ఈస్టర్న్‌ (తూర్పు) ఆర్మీ కమాండ్‌ కు నేతృత్వం వహించిన అనుభవం ఉన్నవాళ్లనే ఆ పోస్టుకు పరిశీలిస్తోందా ? అంటే.. పలువురు పరిశీలకులు “ఔను” అనే సమాధానమే చెబుతున్నారు. ఇక్కడ “ఈస్ట్” అంటే.. ఈస్టర్న్‌ (తూర్పు) ఆర్మీ కమాండ్‌. కీలకమైన చైనా సరిహద్దులలో భద్రతా వ్యవహారాలన్నీ ఇదే చూస్తుంది.
మనదేశ కొత్త ఆర్మీ చీఫ్‌ గా ఈనెలాఖరు లో బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం ఆర్మీ వైస్‌ చీఫ్‌ హోదాలో ఉన్నారు. అయితే ఆయన గతంలో ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహించారు.

లద్ధాఖ్ లోని 8 మౌంటెన్ డివిజన్ కు, తేజ్ పూర్ 4 కార్ప్స్ కు, అండమాన్ నికోబార్ ఐలాండ్ కమాండ్ కు కూడా సారధ్యం వహించిన అనుభవం ఆయన సొంతం. అండమాన్ నికోబార్ ఐలాండ్ కమాండ్ కు నేతృత్వం వహించినందున చైనా నౌకాదళం వ్యూహాలపైనా మనోజ్ పాండే కు అవగాహన వచ్చింది. 2020 ఏప్రిల్ లో భారత్ – చైనా మధ్య తూర్పు లద్ధాఖ్ ప్రతిష్టంభన మొదలైనప్పటి నుంచి చోటుచేసుకున్న పరినామాలను ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ నుంచి ఆయన నేరుగా పర్యవేక్షించారు. ఈక్రమంలో సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా సైన్యం సాగించిన కదలికలనూ మనోజ్ పాండే చూశారు. ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ కు నేతృత్వం వహించిన ఎంతోమంది గతంలో ఆర్మీ చీఫ్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఈ జాబితాలో వీ.కే. సింగ్, మనోజ్ ముకుంద్ నరవనే కూడా ఉన్నారు. ఇక మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ లో ఎన్నడూ పని చేయలేదు. అయినా.. చైనా సరిహద్దులపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉంది. 2015 సంవత్సరం లో మయన్మార్ లోని ఉగ్రవాదుల పై దాడి చేసిన నాగాలాండ్ లోని దిమాపూర్ -3 కార్ప్స్ కు నేతృత్వం వహించింది బిపిన్ రావతే. డోక్లామ్ ప్రాంతంలో చైనా సైన్యాన్ని తిప్పికొట్టే వ్యూహాలు రచించింది కూడా ఆయనే. 1987 సంవత్సరం లో చైనా – భారత్ మధ్య జరిగిన “సందొరుంగ్ చు” ఘర్షణ ల్లో చైనా సైన్యం వ్యవహార శైలిని నేరుగా చూసిన అనుభవం బిపిన్ రావత్ కు ఉంది. గత 2 దశాబ్దాల్లో భారత ప్రభుత్వం ప్రధాన దృష్టి పాక్ సరిహద్దుల నుంచి చైనా సరిహద్దులకు మారింది. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ లో ఆరితేరిన వారికే ఆర్మీ చీఫ్ ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే మనోజ్ పాండే కు కూడా అవకాశం దక్కిందని విశ్లేషిస్తున్నారు.