National Herald Case : ఈడీ విచారణకు రాహుల్… ఈ విషయాన్ని తెలివిగా వాడుకొంటున్న కాంగ్రెస్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేశారు. అయితే కేంద్రం దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నాయని, ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నేతలను తప్పు చేసినవాళ్లుగా చిత్రకరించే పని చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అనుకోకుండా చేసిందో, రాజకీయ స్ట్రాటజీ కోసమే తెలియదు కానీ కాంగ్రెస్ ఈ విషయాన్ని చాల తెలివిగా ఉపయోగించుకొంటుందని చెప్పవచ్చు. రాహుల్ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు, ఈడీ ఆఫీసుల ముందు ధర్నాను నిర్వహించింది. ఇక రెండవ రోజు కూడా రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసుల ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నేతలతో దీక్షలకు పిలుపునిచ్చారు. దీనితో పాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

దేశవ్యాప్తంగా నిన్న జరిగిన నిరసన ప్రదర్శనల్లో అన్ని చోట్ల కాంగ్రేస్ శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా తమ పార్టీకి చెందిన వందలాది మందితో ఈడీ ఆఫీసుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కీలక, సీనియర్ నాయకులందరూ ఈ నిరసనల్లో భాగమయ్యారు. తమ కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ అందరి దృష్టిని తమవైపు ఆకర్షించడంతో పాటు కార్యక్రమాలకు దూరమైన కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో తమ కార్యకర్తలతో బలప్రదర్శనను నిరూపించినట్టు కన్పించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా తప్పేమీ లేదని, ఒకవేళ వాళ్ళు తప్పుచేసిన ఆధారాలుంటే కేంద్రం చూపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈడీ కేసులంటేనే ఎదో కుంభకోణం చేసి ఉంటారనే అభిప్రాయంతో ఉన్న ప్రజలకు బీజేపీ తమకి గిట్టని వాళ్లపై చేస్తున్న కక్షపూరిత చర్యగా ఈసంఘటనని తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యుందనే చెప్పవచ్చు.