Site icon HashtagU Telugu

Bhagat Singh : భగత్ సింగ్ బతికే ఉన్నాడా..?

Bhagat Singh

Bhagat Singh

డా. ప్రసాదమూర్తి

బుధవారం పార్లమెంట్ నిండు సభలో, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పార్టీల నాయకులు కొలువుదీరిన సమయంలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ప్రేక్షకుల గ్యాలరీ నుంచి నాయకుల స్థానాల మీదకు దూకి యధేచ్ఛగా గెంతులు వేసి, పసుపు పచ్చని పొగ పార్లమెంట్ అంతా వ్యాపింపజేసి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేటట్టు చేసిన వార్త ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు. ఒకానొకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదుల చెవులు బద్దలయ్యే శబ్దం చేయాలని నిశ్చయించుకున్న భగత్ సింగ్ ఆనాడు పార్లమెంటులో వేసిన బాంబు ఘటన ఇప్పుడు మరో రూపంలో మరోసారి జరిగినట్టు అనిపిస్తుంది. ఆనాడు భగత్ సింగ్, అతని సహచరుల ఉద్దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అఖండ భారత వాసుల స్వాతంత్ర్య ఆకాంక్షను తెలియజేపడం. ఈనాడు ఈ యువకులు నిరుద్యోగ భారత ఆవేదనను పాలకుల దృష్టికి తీసుకురావడానికి ఇలా చేసినట్టు మనకు మీడియా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు యువకులు పార్లమెంటులోకి ప్రవేశించి తమ పథకం ప్రకారం అనుకున్న విధంగా హల్చల్ చేశారు. అలాగే వారి మిత్రులు నీలమ్ తదితరులు పార్లమెంటు భవనం బయట అదే విధంగా ఆకుపచ్చ పొగను వ్యాపింపజేసి అలజడి చేశారు. వారి ఉద్దేశ్యం కేవలం దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న నిరాశ నిస్పృహల దౌర్భాగ్య స్థితిని పాలకుల గుండెల దాకా తీసుకు రావడమే కాదు. వారు ఈ దేశంలో రైతుల దీన హీన స్థితి పట్ల తమ ఆక్రోశాన్ని తెలియజేయడానికి,, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అల్లకల్లోల స్థితిగతులపై పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి కూడా వారు ఈ మార్గాన్ని వారు ఎంచుకున్నారు.

ఇప్పుడు సమస్య తమ మనోభావాలను, తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకోవడానికి ఈ యువకులు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అన్నది మాత్రమే కాదు. వారు లేవనెత్తిన సమస్యలు సరైనవా కావా అనేది కూడా ప్రధానమైన అంశమే. అన్నిటికంటే దేశానికి నాయకత్వం వహించే ప్రజా ప్రతినిధులు ఆసీనులై సమస్త భారతావని సమస్యలపై చర్చించే చట్టసభ ఎంత భద్రంగా ఉంది అనేది అతి కీలకమైన అంశం. ఈ యువకులు ప్రదర్శించిన నిరసన మార్గం తప్పే గాని, వారు చేసిన ఈ చర్య ద్వారా పార్లమెంటునే భద్రంగా కాపాడలేని నాయకుల చేతుల్లో దేశం ఎంత భద్రంగా ఉంటుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకే ఏలిన వారు ఉలిక్కిపడ్డారు. దీని మీద చర్య తీసుకోమని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే వారికి, వారితో పాటు దేశానికి భరోసా పలకాల్సిన పాలకులు ప్రతిపక్షం మీద కక్ష సాధింపుగా సస్పెన్షన్ వేటు వేసి పార్లమెంటు ఉన్నత ప్రమాణాలను, ప్రజాస్వామ్య విలువలను పరిహాసం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ యువకులు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి అని ఆరా తీస్తే వీరంతా భగత్ సింగ్ భక్తులని, భగత్ సింగ్ మార్గంలో తాము కూడా ఈ పాలకులకు, ఈ దేశపు యువత ఎదుర్కొంటున్న దయనీయ స్థితిని తెలియజేయాలని అనుకున్నారు. భద్రతా సమస్య ఎంత గంభీరమైందో దేశంలో యువకుల నిస్సహాయ స్థితిగతులు కూడా అంతే గంభీరంగా ఉన్నాయని మనకు దీని వల్ల అర్థమవుతుంది. అసలు ఈ యువకులకు పార్లమెంట్లో ప్రవేశానికి అవకాశం కల్పించింది ఏ ప్రతిపక్ష పార్టీ వారో అయితే ఈపాటికి దేశంలో అల్లకల్లోలం చెలరేగేది. యుద్ధ వాతావరణం నెలకొనేది. కానీ ఈ యువకులకు పాసులు ఇచ్చినది బిజెపి ఎంపీ ప్రతాప్ సింహా. ఇతను మైసూరు నుంచి లోక్ సభకు ఎన్నికైన వ్యక్తి. ఇతని నేపథ్యం మొత్తం ఆరా తీస్తే చాలా ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. ఒక జర్నలిస్టుగా తన యాత్ర ప్రారంభించిన ప్రతాప్ సింహా అతి స్వల్ప కాలంలో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడయ్యాడు. 2010లో మైనింగ్ మాఫియా మీద ఒక పుస్తకం రాశాడు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ మీద ఒక పుస్తకం రాసి మోడీ ఆశీస్సులు, అనురాగంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ కూడా కొట్టేశాడు. తర్వాత అదే క్రమంలో 2020లో టిప్పు సుల్తాన్ స్వతంత్ర సమరయోధుడు కాదని తేల్చే మరో పుస్తకం రాసి ఏలిన వారి నుంచి మరిన్ని మార్కులు కైవశం చేసుకున్నాడు. 2019లో కూడా మరోసారి పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు. ఈయన ఘనమైన నేపథ్యం ఇంత మాత్రమే కాదు. ఈ పుస్తకాలు రాయడంతో పాటు కర్ణాటకలో ముస్లిం మైనారిటీ సముదాయానికి వ్యతిరేకమైన అనేక కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించిన ఉదాహరణలు కోకొల్లలు. ఆయన మీదున్న కేసులు కూడా యెడ్యూరప్ప హయాంలో మాఫీ అయ్యాయి. మైనారిటీ వర్గానికి ఎంత వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తే పాలకవర్గానికి అంత దగ్గరవుతామన్న సూత్రాన్ని ప్రతాప్ సింహా చక్కగా కనిపెట్టాడు. ఆ సూత్రం ఆధారంగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడు అయ్యాడు. ఆయన ద్వారా పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు సంపాదించి యువకులు నిండు సభలో చొరబడ్డారు. అందుకే అధికార పార్టీ అధినాయకత్వం తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారు. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అధికార బిజెపి అగ్ర నాయకత్వం ఎలాంటి ఆరాటమూ ప్రదర్శించడం లేదు. సరి కదా, ఇదేనా మన భద్రత.. ఇదేనా దేశానికి మీరు కల్పించే భరోసా, ఏం జరిగింది.. ఎక్కడ లోపం ఆరా తీయండి మహాప్రభో అంటుంటే అలా అంటున్న ప్రతిపక్షాలను దోషులుగా నిర్ధారించి పార్లమెంటు బయటకు నెట్టేస్తున్నారు.

సరే అవకాశం చిక్కింది కదా అని విపక్షాలు, వాళ్ల చేతికి ఏ పక్షానా చిక్కకూడదని భీష్ముంచుకునే అధికార పక్షాలు.. అవన్నీ అలా ఉంచుదాం. కానీ దశాబ్దాల క్రితం ఈ దేశంలో కొందరు యువకులు ప్రాణాలకు తెగించి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్య అధినేతలను గడగడలాడించడానికి ఎంత సాహసం చేశారో, అలాంటి సాహసాన్ని ఈ యువకులు కూడా ఇప్పుడు ప్రదర్శించారు. తాము చేసిన పనికి ఎలాంటి శిక్ష అనుభవించాలో వారికి తెలుసు. అయినా ఈ పనికి వారు పూనుకున్నారంటే ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడే స్థితికి వారు ఎందుకు నెట్టబడ్డారు అని నాయకులంతా ఆత్మ పరిశోధన చేసుకోవాలని చెబుతున్న ఘటన ఇది. అందుకే యువకులు ఎక్కడ తమ సమస్యల మీద ప్రాణాలకు సైతం తెగించి పోరాటాలకు సిద్ధపడతారో అక్కడ భగత్ సింగ్ ఉన్నట్టే. అంటే ఈ దేశంలో ఇంకా భగత్ సింగ్ బతికి ఉన్నట్టే అని చెప్పుకోవాలి. చూద్దాం.. వీరి మీద పాలకులు ఏ చర్యలైనా తీసుకోవచ్చు కానీ వీరు లేవనెత్తిన సమస్యల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదే ముఖ్యం. భగత్ సింగ్ కేవలం అయిదారుగురు యువతీ యువకుల్లో మాత్రమే ఉండడు. సర్వకాల సర్వావస్థల్లోనూ యువ హృదయాల్లో నిత్యం రగులుతూనే ఉంటాడు.

Read Also : Pushpa jagadeesh: యువతి ఆత్మహత్య కేసు.. తన నేరం అంగీకరించిన “పుష్ప” జగధీశ్