Asaduddin Owaisi : గత కొన్ని రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. జూన్‌లో ఈ పరిస్థితులు మరింత ముదిరి, దాడులుగా మారాయి. జూన్ 13న ఇజ్రాయెల్ భారీ స్థాయిలో ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ప్రతిస్పందనగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో తీవ్ర దాడులు జరిపింది. ఈ ఘర్షణల నేపథ్యంలో పరిస్థితి ఇంకా విషమంగా మారింది. తాజాగా అమెరికా కూడా ఈ సంఘర్షణలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని, శాంతి చర్చల పేరుతో ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపింది. దీంతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై వరుస దాడులకు దిగింది. ఈ ఉద్రిక్తతల మధ్య, మధ్యప్రాచ్య దేశాల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. “గల్ఫ్, అరబ్ దేశాల్లో 1.6 కోట్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిపైనే కాకుండా, అక్కడి భారతీయ సంస్థలు చేసిన పెట్టుబడులపైనా ఈ యుద్ధ వాతావరణం ప్రతికూల ప్రభావం చూపుతుంది,” అని ఒవైసీ పేర్కొన్నారు.
ఇక అమెరికా తాజాగా ఇరాన్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో, పాకిస్తాన్ జనరల్ అసీమ్ మునీర్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “అసీమ్ మునీర్ ఈ దాడులకు అనుమతి తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడితో విందు చేయడానికి వెళ్లారా?” అని ప్రశ్నించారు.
ఒవైసీ వ్యాఖ్యలు యుద్ధ వ్యతిరేక శక్తులకు మద్దతుగా ఉండడమే కాకుండా, భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారాయి. “భారతీయుల హక్కులను, వారి భద్రతను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలి” అని ఆయన సూచించారు.