Foxconn: బెంగళూరులో ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్.. ఫాక్స్‌కాన్‌కు 300 ఎకరాల భూమి

ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు మరో ఘనత దక్కనుంది. వరల్డ్ ఫేమస్ యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఆ నగరంలో తయారు చేయనున్నారు.

ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు మరో ఘనత దక్కనుంది. వరల్డ్ ఫేమస్ యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఆ నగరంలో తయారు చేయనున్నారు. ఇందుకోసం ప్రముఖ తైవాన్ కంపెనీ Foxconn కు బెంగళూరు శివార్లలో 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఐఫోన్ల తయారీ ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్‌ రూ.5,700 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.

ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా  Foxconn చైర్మన్ యంగ్ లియు నేతృత్వంలో 17 మంది సభ్యుల ప్రతినిధి బృందం శుక్రవారం బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని క్యాంపస్‌ను సందర్శించింది. గ్లోబల్ కంపెనీలకు బెంగళూరు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానమని, పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా ఉందని ఫాక్స్‌కాన్ చైర్మన్ ప్రశంసించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి వెళ్ళింది. కాగా, భారతదేశంలో ఫాక్స్‌కాన్‌కు ఇది రెండవ అతిపెద్ద పెట్టుబడి. కంపెనీ ఇప్పటికే తమిళనాడులోని ఒక సైట్‌లో లేటెస్ట్ వర్షన్ ఐఫోన్‌లను తయారు చేస్తోంది.

ప్రస్తుతం చైనాలో ప్లాంట్

Foxconn కంపెనీ ప్రస్తుతం చైనీస్ నగరమైన జెంగ్‌జౌలో యాపిల్ ఐ ఫోన్లు ఉత్పత్తి చేస్తోంది. ఆ ప్లాంట్ లో 200,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆపిల్ ఫోన్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్న ఫాక్స్‌కాన్, 2021లో 206 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారు. గత సంవత్సరం నాటికి ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో 20వ స్థానంలో ఉంది. Foxconn చైనా, జపాన్, వియత్నాం, చెక్ రిపబ్లిక్ మరియు USతో సహా ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలు లేదా ప్రాంతాలలో 173 క్యాంపస్‌లు, కార్యాలయాలను కలిగి ఉంది.

Also Read:  Credit Card: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌ లను ఇలా ఉపయోగించుకోండి