Kite festival: ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జనవరి 7న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. గుజరాత్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా అందరితో కలిసి పతంగీని ఎగురవేశారు.ఈ నెల 14 వరకు ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఎంతోమంది విదేశీ టూరిస్టులు కూడా రంగురంగుల పతంగులను ఎగురవేయనున్నారు. ఈ కైట్ ఫెస్టివల్‌కు ఒక చరిత్ర ఉంది. అహ్మదాబాద్‌కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్‌భాయ్ రహీంభాయ్ 1989 జనవరి 7న 500 గాలిపటాల రైలును తయారుచేసి ఎగరవేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 7న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను(Kite festival) ఇదే నగరంలో నిర్వహిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో కొంతమంది రాముడి చిత్రాలతో కూడిన గాలిపటాలను ఎగురవేశారు.
- డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక టూరిస్టు మాట్లాడుతూ.. ‘‘నేను ఇండియాలో కైట్ ఫెస్టివల్‌కు రావడం ఇది మూడోసారి. ఇక్కడ మేం చాలా సరదాగా గడుపుతున్నాం. నేను ఎంతోమందిని కొత్తగా పరిచయం చేసుకున్నాను. గుజరాత్ అందంగా ఉంది. చివరిసారి నేను వచ్చినప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూశాను’’ అని చెప్పుకొచ్చాడు.
- జనవరి 14, 15 తేదీలలో గుజరాత్‌లో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో గాలిపటాలు ఎగరవేయడం అనేది అంతర్భాగం.
Also Read: Five Days In Rubble : ఐదు రోజులు భూకంప శిథిలాల్లో.. బతికి బయటికొచ్చిన 90 ఏళ్ల బామ్మ
జనవరి 13 నుంచి తెలంగాణలో..
తెలంగాణలో జనవరి 13 నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిలువనుంది. సంక్రాంతి ఉన్నందున స్వీట్ ఫెస్టివల్‌ను కూడా దీనితో పాటే నిర్వహించనున్నారు. మూడేళ్ల విరామం తర్వాత ఈ వేడుకను మళ్లీ నిర్వహిస్తున్నారు. బేగంపేట హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పోస్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జనవరి 2నే ఆవిష్కరించారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్‌లో అందుబాటులో ఉంచుతారు. వేదిక వద్ద హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. పతంగుల పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.