Varanasi Stadium – Rs 451 Crore : వారణాసి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత లోక్ సభ నియోజకవర్గం అది. అక్కడ ఎన్నెన్నో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో రూ.451 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కూడా జరగబోతోంది. దీనికి ప్రధాని మోడీ సెప్టెంబర్ 23న (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కోసం భూమిని సమకూర్చేందుకు ఇప్పటివరకు రూ.121 కోట్లను ఖర్చు చేసింది. ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ కూడా మరో రూ.330 కోట్లు ఖర్చు చేయనుంది. శివుని సంగ్రహావలోకనం, కాశీ యొక్క స్వరూపం కనిపించేలా ఈ స్టేడియం నిర్మాణ డిజైనింగ్ ఉంటుందని అంటున్నారు. వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతం గంజరి గ్రామంలోని రింగ్‌రోడ్డుకు సమీపంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు 30 నెలల్లోగా (2025 డిసెంబర్ నాటికి) పూర్తవుతాయని తెలుస్తోంది.
Also read : Check Gold Rates: పసిడి ప్రియులకు పండగే.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
30వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉండేలా నిర్మించనున్న ఈ స్టేడియంలో.. మొత్తం 7 పిచ్‌లు ఉంటాయి. శివుడికి సంబంధించిన సంగీత వాయిద్యం ఆకారంతోపాటు గంగా ఘాట్ మెట్లను పోలిన ప్రేక్షకుల గ్యాలరీ ఈ స్టేడియంలో ఉంటుంది.ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే.. పూర్వాంచల్ క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని బీసీసీఐ అంటోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కర్ కూడా ఈ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం యూపీలోని కాన్పూర్, లక్నోలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అందుబాటులోకి వస్తున్న మూడో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వారణాసి స్టేడియమే.