Site icon HashtagU Telugu

INS Vikrant: విక్రాంత్ రిటర్న్స్

Ins Vikrant

Ins Vikrant

INS విక్రాంత్ .. 1971 భారత్ పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన విమాన వాహక నౌక. 1997లో రిటైర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ నౌకాదళంలోకి ఎంట్రీ ఇస్తోంది సరికొత్త INS విక్రాంత్‌. పూర్తిగా దేశీయంగా నిర్మితమైందీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌.
దేశీయంగా నిర్మించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన INS విక్రాంత్‌ను.. కొచ్చి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మించింది. రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. 100 MSMEలు ఇందుకోసం విడిభాగాలు సమకూర్చాయి.37వేల500 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌక పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2300 కంపార్ట్‌మెంట్స్‌ ఉంటాయి. 1,700 మంది సిబ్బంది పని చేయవచ్చు. 28నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

ఒక్కసారి ఇంధనం నింపుకొంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని రెండుసార్లు చుట్టేయగలదు. INS విక్రాంత్‌ నిర్మాణం 2006లో ప్రారంభమైంది. దాదాపు రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో.. 18అంతస్తులు ఉంటాయి. మిగ్-29 యుద్ధ విమానాలు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లను ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ నుంచి ఆపరేట్ చేయొచ్చు. 1971 వార్‌లో కీలక భూమిక పోషించిన భారత తొలి విమాన వాహక నౌక INS విక్రాంత్ పేరునే.. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు ఇండియన్ నావీ పెట్టింది. INS విక్రాంత్‌ను కమిషన్‌లో పాల్గొనడంతోపాటు భారత నావీకా దళం నూతన ఎన్‌సైన్‌ను ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. వలసవాద గతాన్ని తొలగించి, సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్లుగా కొత్త నౌకాదళ ఎన్‌సైన్‌ ఉంటుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

నావల్ ఎన్‌సైన్‌ అనేది నౌకాదళ నౌకలు లేదా నిర్మాణాలు తమ జాతీయతను సూచించడానికి తీసుకువెళ్లే జెండా. ప్రస్తుత భారత నౌకాదళ నిషాన్‌లో సెయింట్ జార్జ్ క్రాస్ ఉంది. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం ప్రభుత్వం నీలిరంగులో ఉండే భారత నౌకాదళ జెండాతో దీనిని మార్చింది. 2004లో మళ్లీ సెయింట్ జార్జ్‌ క్రాస్‌ను పునరుద్ధరించింది యూపీఏ సర్కార్‌.