INS Vikrant : ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం…శత్రు నౌకలను చిత్తు చేసే విక్రాంత్ గురించి ఎవరికీ తెలియని విశేషాలు..!!

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 01:14 PM IST

భారతదేశపు మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక INS విక్రాంత్ దాదాపు ఒక సంవత్సరం సముద్ర ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ యుద్ద నౌకను రూ. 20,000 కోట్లతో 45,000 టన్నుల యుద్ధనౌకను నిర్మించారు. ఈ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ప్రధాన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

ఐఎన్‌ఎస్ విక్రాంత్ టాప్ 10 విశేషాలు ఇవే..

1. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నౌకాదళంలోకి విమాన వాహక యుద్ద నౌకను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త నౌకాదళ పతాకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారతీయ సముద్ర వారసత్వ సంపదకు అనుగుణంగా కొత్త చిహ్నం ఉంటుందని నావికాదళం గతంలో పేర్కొంది.

2. INS విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు. భారత్‌లో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక ఇదే. దీనిపై 30 యుద్ధ విమానాలను ఉంచవచ్చు. MiG-29K ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లకు వసతి కల్పించవచ్చు. ఈ నౌకలో దాదాపు 1600 మంది సిబ్బందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.

3. INS విక్రాంత్, ప్రారంభంలో, MiG యుద్ధ విమానాలు, కొన్ని చోపర్లను మాత్రమే కలిగి ఉంటుంది. నౌకాదళం 26 డెక్ ఆధారిత విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది, వాటిలో కొన్ని బోయింగ్ , మరికొన్ని డసాల్ట్ విమానాలను స్టోర్ చేయనుంది.

4. INS విక్రాంత్ సుమారు 13 సంవత్సరాల పాటు నిర్మించారు. INS విక్రాంత్ సముద్ర ట్రయల్స్ వివిధ దశలలో కూడా పాల్గొంది, ఆగస్టు 21న ఒక సంవత్సరం ట్రయల్స్‌ను ముగించింది. విక్రాంత్‌ను నేవీకి అప్పగించిన అనంతరం ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ అనేక ట్రయల్స్ నిర్వహిస్తోంది.

5. ఇన్ని రోజులు రష్యా షిప్‌యార్డ్‌లో నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అనే విమాన వాహక నౌక మాత్రమే భారతదేశం వద్ద ఉంది. రక్షణ దళాలు మొత్తం మూడు విమాన వాహక నౌకలను డిమాండ్ చేశాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో ఒక్కో విమాన వాహక నౌకను మోహరించాలని ప్రతిపాదించారు. అలాగే మరొకటి ప్రత్యేక ఉపయోగం కోసం ఉపయోగించాలని నావికా దళం సూచించింది.

6. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తిలో పాల్గొన్న INS విక్రాంత్ పేరును ప్రస్తుతం కొత్త యుద్ద నౌకకు పెట్టడం విశేషం.

7. INS విక్రాంత్‌ ప్రవేశంతో భారతదేశం అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల సరసన చేరింది. ఈ దేశాలు తమ సొంత విమాన వాహక నౌకలను రూపొందించి వాడుకుంటున్నాయి.

8. భారత నావికాదళం కొత్త యుద్ధనౌక దేశ తూర్పు, పశ్చిమ సముద్ర తీరాలలో విమాన వాహక నౌకలను మోహరించి గస్తీ చేయడానికి ఉపయోగించనున్నారు.

9. హిందూ మహా సముద్రంలో చైనా తన శక్తిని దూకుడుగా విస్తరిస్తోంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా నావికా స్థావరం నిర్మించింది. తాజాగా చైనా ‘గూఢచారి’ నౌక శ్రీలంకలో దిగడంతో భారత్ కూడా ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ అందుబాటులోకి రావడం విశేషం.

10. ప్రస్తుతం ఉన్న భారత నౌకాదళంలో ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, 10 డిస్ట్రాయర్‌లు, 12 ఫ్రిగేట్‌లు మరియు 20 కార్వెట్‌లు ఉన్నాయి.