Noida: ఉద్యోగాల నిమిత్తం పట్టణాల్లో నివసించే అనేక మంది దంపతులు, తమ చిన్నారులను చూసుకునే పరిస్థితి లేక డే కేర్ సెంటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఈ సెంటర్లలో పిల్లల భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటుచేసుకుంది. అక్కడి ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల పసిపాపపై మహిళా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు బయటపడటంతో, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక నివాసితులైన ఓ దంపతులు తమ కుమార్తెను రోజూ డే కేర్‌కి పంపిస్తూ ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే ఇటీవల చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె దుస్తులు మార్చే సమయంలో వారి దృష్టికి కొన్ని విషమమైన విషయాలు వచ్చాయి. పాప శరీరంపై గాయాలు, కొరికిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఇదేదో సాధారణం కాదని అనుమానంతో వారు వెంటనే డే కేర్‌కి వెళ్లి అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
#Noida DAY CARE HORROR: A 15-month-old child was beaten, head smashed against a wall, dropped on the ground and bitten.
Every working parent's worst nightmare! pic.twitter.com/KttIyyL0g3
— Karan Singh (@Journo_Karan) August 11, 2025
అక్కడ కనిపించిన దృశ్యాలు వీరిని గుండె తెగేలా చేశాయి. ఒక యువతి, డే కేర్ సిబ్బందిగా పనిచేస్తూ, ఏడుస్తున్న పసిపాపపై ఏమాత్రం కనికరించకుండా ఆమెను నేలపై పడేసి, గోడకు గుద్దుతూ, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా నమోదయ్యాయి. ఆ చిన్నారి కన్నీళ్లూ, బాధలు చూసి కూడా అక్కడి యాజమాన్యం ఏమాత్రం స్పందించకపోవడమే కాకుండా, తల్లిదండ్రులు ఈ విషయం గురించి ప్రశ్నించగా దురుసుగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసు శాఖ సదరు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, బాధ్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకూ డే కేర్ సెంటర్ కార్యకలాపాలను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల్ని ప్రేమతో చూసుకోవాల్సిన డే కేర్ సిబ్బంది నుంచి ఇలా అమానుషంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే ప్రత్యేక నిఘా వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ సంఘటన డే కేర్ సెంటర్ల నియంత్రణపై తిరిగి చర్చ ప్రారంభించేలా చేసింది. పిల్లల భద్రత కోసం స్పష్టమైన ప్రమాణాలు, శిక్షణ పొందిన సిబ్బందిని నియమించడం, నిరంతర సీసీటీవీ నిఘా, పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, నోయిడాలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన, చిన్నారుల భద్రతను పక్కదొసక పెట్టే విధంగా వ్యవహరిస్తున్న కొన్ని డే కేర్ సెంటర్ల పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తల్లిదండ్రులు మాత్రం ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ సంఘటన మిగిల్చింది.
Read Also: Asim Munir : తాము నాశనమైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు