Maharashtra: మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో మానవత్వాన్ని మర్చిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్రూమ్‌లో కనిపించిన రక్తపు మరకలపై విచారణ చేయడం మానేసి, యాజమాన్యం మానవ హక్కుల్ని ఉల్లంఘించేలా బాలికలపై శారీరక పరిశీలన నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలందరినీ స్కూల్ కన్వెన్షన్ హాల్‌కి పిలిపించారు.
Read Also: AP : మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
అక్కడ వారికి బాత్రూమ్‌లో తీసిన రక్తపు ఫోటోలు చూపించి, పీరియడ్స్‌లో ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరోవైపు నిలవాలని ఆదేశించారు. బాలికలు చెప్పిన ప్రకారం రెండు గ్రూపులుగా విడిపోయారు. అయినా ప్రిన్సిపల్ వారిని నమ్మక, మహిళా అటెండెంట్‌ను పిలిపించి ప్రత్యేకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ అటెండెంట్ పీరియడ్స్‌లో లేమని చెప్పిన బాలికలను ఒక్కొక్కరిగా వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి వారి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థినుల స్వాభిమానాన్ని తాకట్టు పెట్టారు. ఈ ఘటనతో మనోవ్యథకు గురైన బాలికలు ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం తమ తల్లిదండ్రులకు తెలిపారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూల్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రిన్సిపల్, మహిళా అటెండెంట్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలపై పాస్కో చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈఎంతో పాటు ప్రిన్సిపల్, ప్యూన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగతా బాధితులను విచారిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. విద్యా వ్యవస్థలో ఇలాంటి అమానవీయ చర్యలు చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొంటూ, బాధ్యులపై కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాలలు భద్రతా కోటల్లా ఉండాలని భావించే సమాజంలో, ఇలాంటి దారుణాలు పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం, శిశు హక్కుల సంఘాలు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.