గురుగ్రామ్/బెంగళూరు: (Indigo Airlines) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ట్రైనీ పైలట్ ఒకరు తన సహోద్యోగులు తనపై కుల దూషణలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇండిగో కెప్టెన్‌తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుడు బెంగళూరులో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి కాగా, ఆయన ద్రవిడ సామాజిక వర్గానికి చెందినవాడు.
ఈ ఘటన బెంగళూరులోని శోభా సిటీ సెంటోరినిలో జరిగిన సమావేశంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ మీటింగ్‌లో బాధితుడిని కులానికి సంబంధించిన వ్యాఖ్యలతో అందరి ముందు అవమానించారని ఆరోపించాడు. “నీవు విమానం నడపగలవాడివికావు… పోయి చెప్పులు కుట్టు” అంటూ కులాన్ని తీసుకొచ్చి తీవ్రంగా హేళన చేశారని వివరించాడు. దూషణలు TAPAS DEY, MANISH SAHNI, కెప్టెన్ RAHUL PATIL చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై బాధితుడు ముందుగా ఇండిగో సీఈఓతో పాటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఆపై బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి కేసును గురుగ్రామ్‌కి బదలీ చేశారు. ప్రస్తుతం కేసు గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేస్-1 పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతోంది.
కేవలం కుల పరమైన కారణాల కోసం అనేకసార్లు వార్నింగ్ లెటర్లు ఇచ్చినట్టు, జీతం తగ్గించారని, వైద్య సెలవులపై కట్ చేసినట్టు, సిబ్బంది ప్రయాణాలను రద్దు చేశారని మరియు రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెచ్చారని బాధితుడు వాపోయాడు.
ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా విమర్శలు రేపుతోంది. విమానయాన రంగంలో వృత్తిపరమైన ప్రవర్తన ఎలా ఉండాలో మరోసారి ఈ ఘటన ప్రశ్నిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇండిగో సంస్థ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.