భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

పొరుగు దేశాల నుండి రాకెట్లు, డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఈ సాంకేతికత చాలా కీలకం. ఈ డీల్ ఖరారైతే భారత సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయి.

Published By: HashtagU Telugu Desk
Iron Dome Technology

Iron Dome Technology

Iron Dome Technology: భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే దిశగా ఒక కీలక అడుగు పడబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక రక్షణ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘ఐరన్ డోమ్’ మిస్సైల్ సాంకేతికతను ఇజ్రాయెల్ భారత్‌తో పంచుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ముంబైలోని ఇజ్రాయెల్ రాయబారి యానివ్ రేవాచ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం కేవలం ఆయుధాల కొనుగోలుకే పరిమితం కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవస్థలను భారత్‌లోనే తయారు చేసేలా ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.

సాంకేతికతను పంచుకోవడానికి ఇజ్రాయెల్ సుముఖత

భారత్- ఇజ్రాయెల్ దేశాలు ఒకే రకమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, అందుకే ఇజ్రాయెల్ తన హైటెక్ సాంకేతికతను భారత్‌కు అందించడానికి సిద్ధంగా ఉందని రేవాచ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మేము రక్షణ ఒప్పందాలను విస్తరిస్తాము. ముఖ్యంగా భారత్‌లో తయారీ, ఐరన్ డోమ్ వంటి వ్యవస్థల సహకారం, సాంకేతిక భాగస్వామ్యంపై దృష్టి సారిస్తాము” అని తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలనే భారత ఆత్మనిర్భర్ లక్ష్యానికి ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

Also Read: తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

అసలు ‘ఐరన్ డోమ్’ అంటే ఏమిటి?

ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను గాలిలోనే గుర్తించి ధ్వంసం చేస్తుంది. దీని విజయవంతం రేటు 90 శాతానికి పైగా ఉండటంతో శత్రువుల దాడులకు వ్యతిరేకంగా ఇది ఒక ‘ఇనుప కవచం’లా పనిచేస్తుంది. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో దాదాపు 450 క్షిపణులు, 1000 డ్రోన్లలో 90 శాతం కంటే ఎక్కువ వాటిని ఇది విజయవంతంగా అడ్డుకుంది.

భారత్‌కు ఈ సాంకేతికత ఎందుకు అవసరం?

పొరుగు దేశాల నుండి రాకెట్లు, డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఈ సాంకేతికత చాలా కీలకం. ఈ డీల్ ఖరారైతే భారత సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయి. రక్షణ పరిశ్రమలో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయి. ఇజ్రాయెల్ రాయబారి ప్రకటనను బట్టి చూస్తుంటే భారత్‌ను ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఇజ్రాయెల్ పరిగణిస్తోందని స్పష్టమవుతోంది. ఈ సహకారం ఇరు దేశాల భద్రతను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

  Last Updated: 23 Feb 2026, 07:08 PM IST