Pinaka Rocket : ఆయుధాల తయారీలో ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలను అందిస్తోంది. మన దేశంలో తయారయ్యే చాలా ఆయుధాలు, మిస్సైళ్లు, బాంబులు, రాకెట్లకు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా మన దేశానికి ఆర్డర్లు ఇస్తున్న జాబితాలో చాలావరకు మధ్య ఆదాయ దేశాలు, పేద దేశాలే ఉండేవి. ఇప్పుడు అగ్రరాజ్యాలు కూడా ఆ లిస్టులో ఒక్కటొక్కటిగా చేరుతున్నాయి. ఫ్రాన్స్.. వీటో పవర్ కలిగిన శక్తివంతమైన దేశం. మన దేశం స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ల(MBRL)పై ఫ్రాన్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇలాంటి మిస్సైళ్లను తయారు చేస్తున్న భారత్ సహా పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని స్వయంగా ఫ్రాన్స్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ రిషు వెల్లడించారు. ప్రస్తుతం పినాక పనితీరును తాము టెస్టింగ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఒకవేళ ఈ టెస్టుల్లో పినాక(Pinaka Rocket) బెస్ట్ అనిపిస్తే.. కొనుగోలు కోసం ఫ్రాన్స్ ఆర్మీ నుంచి భారత్‌కు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. పినాక MBRLను మన దేశానికి చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) తయారు చేసింది. పినాక నుంచి ప్రయోగించే రాకెట్లు 75 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ధ్వంసం చేయగలవు.
Also Read :Trump India : గెలుపు ఎఫెక్ట్.. భారత్‌లో ట్రంప్ వ్యాపారాలకు రెక్కలు.. హైదరాబాద్‌లోనూ ప్రాజెక్టు
- పినాక కొనుగోలుకు ఇప్పటికే ఆర్మేనియా సహా పలు దేశాల నుంచి భారత్‌కు ఆర్డర్లు వచ్చాయి.
- ఆకాశ్, 155-ఆర్టిల్లరీ గన్స్, పినాక MBRL వంటి ఆయుధాలను భారత్ నుంచి ఇప్పటికే ఆర్మేనియా కొంటోంది.
- బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్, డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్స్, రాడార్స్, ఆకాశ్ మిస్సైల్స్, పినాక RL, ఆర్టిల్లరీ వంటి పలు ఆయుధాలను వివిధ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది.
- భారత్-ఫిలిప్పీన్స్ మధ్య భారీ ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులను ఆ దేశానికి భారత్ ఎగుమతి చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.2,800 కోట్లకుపైనే.