Site icon HashtagU Telugu

India Operation Dost: భారత్ సేవాదృక్పథానికి ప్రపంచం ఫిదా

earthquake in turkey

Resizeimagesize (1280 X 720)

భారత్ (India) నిజమైన దోస్త్ అంటున్నారు టర్కీ ప్రజలు. కష్టకాలంలో అండగా నిలిచిన భారత (India) ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. భూప్రళయంతో కకావికలమైన టర్కీ, సిరియా సహాయక చర్యల్లో కీలక భూమిక పోషిస్తోంది ఇండియన్ ఆర్మీ. మన వైద్య బృందాలు అందిస్తున్న సేవలకు యావత్ ప్రపంచం హ్యాట్సాఫ్‌ చెబుతోంది. భూకంప విలయంతో మరుభూములుగా మారిన టర్కీ, సిరియాల్లో మృత్యుఘోష ఆగడంలేదు, ఇప్పటికే మరణాల సంఖ్య 41వేలు దాటిపోయింది. టర్కీలో 35వేల418 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 5,814 మంది మరణించారు.మృతుల సంఖ్య లక్షకు చేరొచ్చనే అంచనాలు ఆందోళన పెంచుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం నిరంతర అన్వేషణ జరుగుతోంది. కూలిన భవనాల వద్ద జాగిలాలతో అణువణువూ జల్లెడపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్‌. భూకంపం సంభవించి 9 రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి స్వరాలు వినిపిస్తున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు గడ్డకట్టే చలిలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయ బృందాలు. విదేశాల నుంచి వచ్చిన ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక భూమిక పోషిస్తోంది ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా భారత సైనిక డాక్టర్లు ప్రాణదాతలుగా మారారు. 60 పడకల ఫీల్డ్‌ హాస్పిటల్‌లో వందలమంది చికిత్స పొందుతున్నారు. 10మందికి మేజర్ సర్జరీలు కూడా జరిగాయి. దాదాపు 100మంది భారత సైనిక సిబ్బంది ఈ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు.

Also Read: Turkey: తానున్నానంటూ తుర్కియో ప్రజలకు… మన బీనా!

భారత సైన్యం అందిస్తోన్న సాయానికి మెచ్చి, టర్కిష్‌ మహిళ ఒకరు మన సైనికురాలిని ప్రేమగా ముద్దాడిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . ఆమె పేరు.. మేజర్ డాక్టర్‌ బీనా తివారీ. టర్కీ వెళ్లిన భారత వైద్య బృందంలో ఉన్న ఏకైక మహిళ. తాజాగా బినా ఓ బాలికను కాపాడిన చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇదీ భారత్ గ్లోబల్ ఇమేజ్ అంటూ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో విషం చిమ్మినా.. వెయ్యి టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపడంతోపాటు టర్కీకి ఆపన్నహస్తం అందించిన భారతదేశంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Exit mobile version