5G Spectrum: ముగిసిన 5 G స్పెక్ట్రమ్‌ వేలం

5 G స్పెక్ట్రమ్‌ వేలం కొత్త రికార్డులు సృష్టించింది.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 09:00 PM IST

5 G స్పెక్ట్రమ్‌ వేలం కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు వేసిన స్పెక్ట్రమ్‌ వేలంతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం భారీ మొత్తంఆర్జించింది. మొట్టమొదటిసారిగా 700 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌కు అత్యధిక పోటీ వచ్చిందని కేంద్రం తెలిపింది. ఇందులో 600 మెగాహెడ్జ్‌, 800 మెగాహెడ్జ్‌, 2300 మెగాహెడ్జ్‌ బ్యాండ్లకు బిడ్లేవీ దాఖలు కాలేదు. 4జీతో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించగల 5జీ స్పెక్ట్రమ్ వేలం కు అనుహ్యమైన స్పందన వచ్చింది. దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాతోపాటు అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇందులో పాల్గొన్నాయి. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ కోసం స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు టెక్ సంస్థలకు అనుమతినివ్వడం ఈసారి వేలం ప్రత్యేకత. 10 బ్యాండ్లలో మొత్తంగా 72 గిగా హెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను కేంద్రం విక్రయానికి ఉంచింది. ఈ మొత్తం స్పెక్ట్రమ్‌ కనీస విలువ దాదాపు 4.3 లక్షల కోట్లు. వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ను ఆయా సంస్థలు 20 ఏళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. స్పెక్ట్రమ్ సొమ్మును 20 వార్షిక వాయిదాల్లో కట్టుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీంతో టెలికాం కంపెనీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు వేలం వేసిన స్పెక్ట్రమ్‌ వేలంతో పోలిస్తే తొలిసారి టెలికాం డిపార్ట్‌మెంట్‌కు భారీ ఆదాయం సమకూరింది.

2015 స్పెక్ట్రమ్‌ వేలంలో అత్యధికంగా లక్షా 9వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2016లో 65వేల 789 కోట్లు , 2021లో 77వేల 814 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రస్తుత 5జీ వేలంలో 80వేల 100 కోట్లకు సంబంధించి రిలయన్స్‌ జియో బిడ్స్‌ దాఖలు చేయగా, భారతీఎయిర్‌టెల్‌ 50 వేల కోట్లకు , వొడాఫోన్‌ ఐడియా 15వేల కోట్లకు, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 5వేల కోట్లకు బిడ్స్‌ దాఖలు చేసింది. రెండ్రోజుల్లోనే ముగుస్తుందనుకున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం జులై 26న ప్రారంభమై వారం రోజుల పాటు జరిగింది. చివరి రోజు నాలుగు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 1.50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ వేలం ప్రక్రియలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. మరో టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌ కోసం వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్‌ 26 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. మొత్తం స్పెక్ట్రమ్‌ వేలంలో 600 MHz, 800 MHz, 2300 MHz బ్యాండ్లకు బిడ్లేవీ దాఖలు కాలేదు. 5జీ బ్యాండ్లైన 3300 MHz, 26 GHzకు మాత్రం మూడింట రెండొంతుల బిడ్లు వచ్చాయి. 2016, 2021లో రెండుసార్లు వేలానికి వచ్చినా బిడ్లకు నోచుకోని 700 MHz బ్యాండ్‌కు మాత్రం నాలుగోవంతు బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు 1.45 లక్షల కోట్లు విలువైన బిడ్లు దాఖలు కాగా.. ఆ తర్వాత మరో ఆరు రోజులు వేలం ప్రక్రియ కొనసాగినా బిడ్ల విలువ పెద్దగా పెరగలేదు. ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్ కు సంబంధించిన సర్కిల్‌లో అత్యధికంగా బిడ్‌ల కోసం కంపెనీలు పోటీపడ్డాయి.