Super App : త్వరలోనే రైల్వే శాఖ ‘సూపర్ యాప్’ వస్తోంది. దీన్ని డిసెంబరు నెలాఖరుకల్లా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వేశాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఈ ఒక్క యాప్‌లో పొందొచ్చని అంటున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం..
Also Read :Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
ప్రస్తుతం రైల్వే శాఖకు సంబంధించిన వివిధ సేవల కోసం వేర్వేరు యాప్స్, వెబ్‌సైట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఉంది. అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్ ఉంది. ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్(Super App) ఉంది. ఫిర్యాదులు- ఫీడ్ బ్యాక్ సమర్పించేందుకు రైల్ మదద్ యాప్ ఉంది. రైలు ఎక్కడ ఉందనే సమాచారాన్ని ట్రాక్ చేసేందుకు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ యాప్ ఉంది. ఇకపై ఈ యాప్‌లన్నీ ఒకే ఒక సూపర్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
దీన్ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేస్తోందని సమాచారం. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)కి అనుసంధానమై ఈ యాప్ పనిచేయనుంది. ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్, ప్లాట్‌ఫామ్ టికెట్, అన్ రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ రన్నింగ్ స్టేటస్ సైతం ఇందులోనే చూడొచ్చు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect) యాప్‌ను దాదాపు 10 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రత్యేకించి ట్రైన్ ట్రాకింగ్ కోసం చాలామంది వివిధ థర్డ్ పార్టీ యాప్‌లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ దాదాపు రూ. 1111 కోట్ల నికర లాభం వచ్చింది. రూ.4,270 కోట్ల రెవెన్యూను ఆ సంస్థ ఆర్జించింది. ఐఆర్‌సీటీసీకి వచ్చిన రెవెన్యూలో 30.33 శాతం టికెట్ల విక్రయాల ద్వారా సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో 45.3 కోట్ల రైల్వే టికెట్లను ఐఆర్‌సీటీసీ విక్రయించింది.