Site icon HashtagU Telugu

Merits of Dowry Shocker: అందంలేని అమ్మాయిలకు వరకట్నం వరమట..!!

Book

Book

వరకట్న దురాచారంపై ఎప్పటినుంచో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం తేవాలంటూ ఇల్లాలిపై ఇప్పటికీ అకృత్యాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇల్లాలిని అత్తింటివారు చంపడమో లేదా…వారి వేధింపులు తాళలేక ఆ ఇల్లాలే ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా…ఇవేవీ పట్టనట్లు..వరకట్నంతో బోలెడు లాభాలంటూ పుస్తకాల్లో పాఠాలుగా రాస్తున్నారు. వాటిని విద్యార్థులకు బోధిస్తున్నారు.

అవును మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలో అచ్చంగా ఇలాంటిదే జరిగింది. బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం సోషియాలజీ పుస్తకాల్లో వరకట్నంతో లాభాలు అనే పేరిటి పాఠం రాశారు. ఈ పుస్తకాన్ని టి.కె. ఇంద్రాణీ అనే సీనియర్ రచయిత రాశారు. జైపీ బ్రదర్స్ మెడికల్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. కొందరు నర్సింగ్ విద్యార్థినులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా మంది సదరు పాఠంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజం పురోగమిస్తుంటే…ఇలాంటి పాఠాలు పెడుతూ మరింత వెనక్కకు నెట్టేస్తారా అంటూ నిలదీస్తున్నారు.

ఆ పుస్తకంలో ఏముంది..?
కట్నమంటే ఎందుకో అందరూ వింతగా చూస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఇంటి ఆడపడుచులకు కట్నం ఇచ్చి పంపించేందుకు బదులుగా…తన కొడుకు కోసం కట్నం తీసుకుంటారు. తన కొడుకుకు కట్నం తీసుకువస్తే…తమ ఇంటి ఆడపడుచులకు పెళ్లి చేసి పంపించాలని భావిస్తారంటూ చిత్రల ద్వారా పాఠంలో విశ్లేషించారు.

ఇదే కాదు అందంలేని అమ్మాయిలకు కట్నం వరమని…వారికి త్వరగా పెళ్లి అయ్యేందుకు కట్నం చాలా ఉపయోగపడుతుందని పాఠంలో పేర్కొన్నారు. ఈ పాఠాన్ని వెంటనే పుస్తకంలో నుంచి ఉపసంహరించుకోవాలని…విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక భారత నర్సింగ్ మండలి కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ పాఠం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పాఠాలు చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. తాము కొన్ని నర్సింగ్ ప్రోగ్రామ్ లకే సిలబస్ సిఫార్సు చేస్తామని…కట్నం గురించి సిలబస్ లో పేర్కొనలేదని వివరణ ఇచ్చింది.