Site icon HashtagU Telugu

Ship Hijack : నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు.. రంగంలోకి భారత యుద్ధనౌక

Ship Hijack

Ship Hijack

Ship Hijack : అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇంకో నౌకను ఆ దొంగలు హైజాక్ చేసి తీసుకెళ్లారు. హైజాక్‌కు గురైన నౌక ఇరాన్‌కు చెందినదని.. దాని పేరు ‘ఎంవీ ఇమాన్’ అని తెలిసింది. అయితే ఈ  ఫిషింగ్ నౌకను సాహసోపేతంగా వ్యవహరించి భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. నౌకలోని మొత్తం 17 మంది మత్స్యకారులను కాపాడామని తెలిపారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన 700 నాటికల్ మైళ్ల దూరంలో సోమాలియా సముద్రపు దొంగలు ఈ నౌకను హైజాక్ చేశారని వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

సముద్రపు దొంగలు ‘ఎంవీ ఇమాన్’ నౌకను హైజాక్(Ship Hijack) చేసిన వెంటనే  దాని నుంచి భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రకు ఎస్ఓఎస్ మెసేజ్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన భారత యుద్ధనౌక సంఘటనా స్థలం దిశగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. సముద్రపు దొంగలను తరిమికొట్టి.. ఇరాన్ ఫిషింగ్ నౌకను రక్షించింది. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌ సముద్ర జలాల్లో బ్రిటన్‌కు చెందిన యుద్దనౌకపై యెమన్ హౌతీ మిలిటెంట్లు డ్రోన్ దాడి చేశారు. దాని నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ అందుకున్న భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి.. బ్రిటన్ నౌకకు అంటుకున్న మంటలను ఆర్పేసింది.

Also Read :Whatsapp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. బ్యాకప్‌ చేయకుండానే డేటా ట్రాన్స్‌ఫర్‌!

ముగ్గురు అమెరికా సైనికులు మృతి

జోర్డాన్​లోని అమెరికా సైనిక స్థావరంపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని అమెరికా వెల్లడించింది. యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో తమ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి అని అమెరికా తెలిపింది. ఆదివారం నాలుగు శత్రు స్థావరాలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది. సిరియాలో మూడు, జోర్డాన్‌లోని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఒక ప్రాంతంపై దాడులు చేసినట్లు పేర్కొంది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారిని తగిన సమయంలో శిక్షిస్తాం. ‘మా దేశం ముగ్గురు సైనికులను కోల్పోయింది. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అని జో బైడెన్ పేర్కొన్నారు.

Exit mobile version