Army Helpline : భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, మాజీ సైనికులకు ఆపత్కాలంలో సాయం చేసేందుకు 24/7 హెల్ప్‌లైన్ సర్వీసును ప్రారంభించింది. ఎవరైనా సైనికులు, మాజీ సైనికులు వారిపై దాడి జరిగినప్పుడు లేదా ఏదైనా అత్యవసర సాయం అవసరమైతే ఇక నుంచి 155306 నంబరుకు ఫోన్ కాల్ చేయొచ్చు. ఇటీవలే ఒడిశాలో ఒక ఆర్మీ అధికారికి కాబోయే భార్యను పోలీసులు వేధించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత ఆర్మీ సైనికులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read :BITS Pilani Hyderabad : గ్రహాలను చూపించే టెలిస్కోప్.. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో సందడి
155306 హెల్ప్‌లైన్ నంబరుకు(Army Helpline) వచ్చే కాల్స్‌ను శిక్షణ పొందిన మిలిటరీ పోలీసు సిబ్బంది స్వీకరిస్తారు. కాల్ వివరాలను రిజిస్టరులో వివరంగా నమోదు చేస్తారు. ఈ టీమ్‌లో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటారు. హెల్ప్‌లైన్‌కు వచ్చే అన్ని కాల్స్‌ను రికార్డు చేస్తారు. దీనివల్ల ఆయా అంశాలపై హెల్ప్‌లైన్ టీమ్ వైపు నుంచి ఫాలో అప్ ప్రక్రియ ఈజీ అవుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సైనికులు, మాజీ సైనికులు ఈ నంబరుకు కాల్ చేసి సాయాన్ని పొందొచ్చు. త్వరితగతిన స్పందన లభిస్తుందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా ఈ హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేయొచ్చు. నంబరు ముందు ఎలాంటి కోడ్‌ను యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
Also Read :Citadel Honey Bunny : ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లోని కోటకు మొఘల్స్‌తో లింక్.. చరిత్ర ఇదీ
ఈ హెల్ప్‌లైన్ అన్ని ప్రధాన టెలికాం ప్రొవైడర్ల నెట్‌వర్క్‌లను కవర్ చేస్తుంది. ఈ నంబరుకు కాల్ చేసేవారు తొలుత ఆర్మీతో వారి సంబంధం, సర్వీసు వివరాలను సంక్షిప్తంగా అందించాలి. అనంతరం ఈ హెల్ప్‌డెస్క్‌లోని టీమ్.. కాల్ చేసిన వ్యక్తి ఉండే ప్రాంతానికి అత్యంత సమీపంలోని ప్రొవోస్ట్ పోలీస్ యూనిట్‌తో సమన్వయం చేసుకుంటుంది. కాల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. భూ వివాదాలు, వివాహ వైరుధ్యాలు వంటి వాటితో ముడిపడిన సమస్యలను ఈ హెల్ప్ లైన్ స్వీకరించదు.