Indian Family Killed : అమెరికాలో భారతీయుల హత్యలు ఆగడం లేదు. తాజాగా కేరళకు చెందిన ఒక కుటుంబంలోని సభ్యులంతా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వారి ఇంటిలో శవాలై కనిపించారు. చనిపోయిన వారిని ఆనంద్ సుజిత్ హెన్రీ (42), ఆయన భార్య అలిస్ ప్రియాంక (40), వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్, నీతాన్‌లుగా గుర్తించారు. సమీప బంధువులు చేసిన ఫోన్ కాల్స్‌కు ఆనంద్ సుజిత్ హెన్రీ ఫ్యామిలీ ఎంతకూ స్పందించలేదు. దీంతో వారికి సందేహం వచ్చి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా.. తలుపులు మూసి ఉన్నాయి. ఎంత కొట్టినా తలుపులు తెరవడం లేదు. దీంతో తెరిచి ఉన్న ఒక కిటికీ ద్వారా పోలీసులు లోపలికి ప్రవేశించారు. ఆ ఇంట్లోని వారంతా శవాలై పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆనంద్, ఆలిస్ ప్రియాంక దంపతులు బాత్రూమ్‌లో తుపాకీ గాయాలతో చనిపోయి పడి ఉన్నారు. కవల పిల్లలు బెడ్‌రూమ్‌లో చనిపోయి పడి ఉన్నారు.
ఏం జరిగింది ?
దంపతులిద్దరూ పిల్లల్ని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా ? ఎవరైనా ఈ దంపతులను చంపి, పిల్లల్ని కూడా హతమార్చారా ? అనేది విచారణలో(Indian Family Killed) తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రాథమిక విచారణలో సేకరించిన సమాచారం ప్రకారం.. ఆనంద్ సుజిత్ హెన్రీ నివసిస్తున్న ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు దొరకలేదు.బాత్‌రూమ్‌లో 9ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాస్పద మరణాల కేసును శాన్ మాటియో కౌంటీ యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CIB)కు అప్పగించారు. సాన్ మాటియో కౌంటీ క్రైమ్ ల్యాబ్‌తో కలిసి సాక్ష్యాలను సేకరించారు. మృతదేహాలను శాన్ మాటియో కౌంటీ కరోనర్ అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ఆనంద్ సుజిత్ హెన్రీ కుటుంబం గత తొమ్మిదేళ్లుగా అమెరికాలోనే నివసిస్తోంది.
- ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆలిస్ సీనియర్ అనలిస్ట్.
- వీరి ఫ్యామిలీ రెండేళ్ల క్రితమే న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీకి మకాం మార్చింది.
- ఆనంద్ దంపతులు ఉద్యోగాల్లో చాలా కష్టపడేవారని.. తమతో స్నేహపూర్వకంగా మెలిగే వారని ఇరుగుపొరుగు వారు చెప్పుకొచ్చారు.
- కోర్టు రికార్డుల ప్రకారం. 2016 డిసెంబర్‌లో విడాకుల కోసం ఆనంద్ అప్లై చేశాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది.
- ఈ జంట 2020 సంవత్సరంలో రూ.16 కోట్లకు ఇంటిని కొనుగోలు చేసినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది.
- అమెరికాలోని మసాచుసెట్స్‌లో రూ.41 కోట్లు విలువ చేసే భవనంలో నివసిస్తున్న ఒక భారతీయ ఫ్యామిలీ కూడా ఇటీవల ఇదే విధంగా హత్యకు గురైంది.
- మసాచుసెట్స్ కేసుకు, ప్రస్తుతం జరిగిన ఆనంద్ ఫ్యామిలీ మర్డర్ కేసుకు దగ్గరి పోలికలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.