Site icon HashtagU Telugu

India war: విజయగర్జనకు నేటితో 50 వసంతాలు

India Pak War

India Pak War

పాకిస్థాన్ పై భారత్ విజయానికి నేటితో 50 సంవత్సరాలు పూర్తీ. 1947 పాకిస్థాన్, ఇండియా విడిపోయిన తరువాత ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బాంగ్లాదేశ్) వెస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత పాకిస్థాన్ ) ఒకే దేశంగా ఉండేవి. రెండు దేశాల మధ్య సుమారు 1600 కిలోమీటర్ల దూరం. భౌగోళికంగానే కాకుండా రెండు ప్రాంతాల మధ్య భాష, సంస్కృతి కూడా వేర్వేరు ఉండేవి. వెస్ట్ పాకిస్థాన్ లో ఉర్దూ , ఈస్ట్ పాకిస్థాన్ లో బెంగాలీ మాట్లాడతారు. 1948 లో అప్పటి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా ఉర్దూ అధికార భాష గా అమలు చేశారు. దీంతో చిర్రెత్తిన బెంగాలీలు ప్రభుత్వ కార్యకలాపాల్లో బెంగాలీనే అమలు చేయాలనీ ఉద్యమం ప్రారంభించారు. అంతేకాకుండా వెస్ట్ పాకిస్థాన్ నుండి వచ్చిన పాలకులు, అధికారులు, సైనికుల పెత్తనం పెరిగి.. 1964, 69 లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిపోయాయి.

నాటి అధ్యక్షుడు యాహ్యాఖాన్ దేశంలోనే తొలి సారి 1970లో సాధారణ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలు ఉండగా ఈస్ట్ పాకిస్థాన్ కు చెందిన ముజిబిర్ రెహ్మాన్ సారథ్యంలోని పార్టీ 160 స్థానాలు గెలుచుకొని జాతీయ అసెంబ్లీ లో మెజారిటీ సాధించింది. అప్పటికే వెస్ట్ పాకిస్థాన్ నాయకులదే పెత్తనం కావడంతో 81సీట్లు మాత్రమే గెలిచిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత జుల్ఫికర్ అలీ భుట్టో ఈస్ట్ పాకిస్థాన్ కు చెందిన ముజిబుర్ రెహ్మాన్ కు ప్రధానమంత్రి పదవి కట్టబెట్టేందుకు అంగీకరించలేదు. యాహ్యాఖాన్ వీరిద్దరిని కాదని.. నూరల్ హాసన్ ను ప్రధానిగా నియమించారు. అప్పటికే వెస్ట్ పాకిస్థాన్ పెత్తనంతో మండుతున్న ఈస్ట్ పాకిస్థాన్ లో ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. యాహ్యాఖాన్ పాక్ బలగాలను పెద్ద సంఖ్యలో ఢాకాకు పంపారు. మార్చ్ 25న బట్ బుచ్చర్ అఫ్ బెంగాల్ గా పిలవబడే లెఫ్టినెంట్ జనరల్ టిక్కా ఖాన్ కనీవినీ ఎరుగని రీతిలో బెంగాలీల పై దమనకాండ మొదలు పెట్టారు. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరిట ఇంటింటా సోదాలు చేసి.. రెబెల్స్ ను బహిరంగంగా చంపేశారు. మానభంగాలు, గృహదహనాలు నిత్యేకృత్యమయ్యాయి. బాంగ్లాదేశ్ అధికారిక గణాంకాల ప్రకారం 30 లక్షల మందిని చంపేశారు, 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు చేశారు.

ఈస్ట్ పాకిస్థాన్ లో హింస నానాటికి తీవ్రమవుతుండటంతో ప్రస్తుత బాంగ్లాదేశ్ లోని పౌరులు, సైనికులు భారత్ కు రాగా.. శరణార్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అప్పటికే భారత సైన్యాన్ని సిద్ధం చేసిన ఇందిరా గాంధీ సరైన సమయం కోసం ఎదురు చూసింది. 1971 డిసెంబరు 3న సాయంత్రం 5.40 కి పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత్ లోని ఆగ్రా స్థావరాలపై దాడి చేశాయి. ఈ దుస్సాహసానికి “ఆపరేషన్ చంఘిజ్ ఖాన్’ అని పేరు పెట్టుకున్నాయి. అదే రోజు రాత్రి భారత వాయుసేన ప్రతీకార దాడులు చేసింది. మరుసటి రోజు భారత నౌకాదళం, వాయుసేన, పదాతిదళాలు ఒక్కసారిగా పాకిస్థాన్ నౌకలను, పోర్టులను, వాయుసేనను, ధ్వంసం చేస్తూ.. అదే సమయం లో ఈస్ట్ పాకిస్థాన్ చుట్టుముట్టాయి భారత బలగాలు. డిసెంబరు 16న అరగంటలో పాకిస్థాన్ బలగాలను లొంగి పోవాలని ఆదేశించగా.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిబంది బర్మా పారిపోయారు. గత్యంతరం లేక దాదాపు 93,000 పాక్ సైన్యం భారత్ కు లొంగిపోయాయి. దీంతో భారత్ 13 రోజుల్లోనే యుద్ధం ముగించింది. పాకిస్థాన్ నుండి బాంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.