16th BRICS Summit : రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత్ ఎప్పటికీ యుద్దానికి మద్దతు ఇవ్వదని.. వివాదాస్పద సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యానికి సహకరిస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి వంటి భీకర సవాల్ ను కలిసికట్టుగా ఎదుర్కొన్ననట్టు భావి తరాలకు సంపన్న భవిష్యత్ ను అందించే సామర్థ్యాలు మనకున్నాయి. సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారం పై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలపై ద్వంద వైఖరి సరికాదన్నారు. మన దేశాల్లో యువత ఉగ్రవాదం బాట పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐక్యరాజ్యసమితిలో పెండింగ్ లో ఉన్న ఉగ్రవాద అంశం పై పని చేయాలన్నారు.
ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై బ్రిక్స్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టినట్లు గుర్తుచేశారు.
ద్రవ్యోల్బణం, ఆహార భద్రత, సైబర్ బెదిరింపులు వంటి ప్రపంచ సవాళ్లను గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ”ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం మరియు ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత మరియు నీటి భద్రతను రక్షించడం ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు” అని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో సంస్కరణల కోసం బ్రిక్స్ భాగస్వాములు సమిష్టిగా తమ గళాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సురక్షితమైన కృత్రిమ మేధస్సుతో పాటు సైబర్ భద్రత కోసం ప్రపంచ నిబంధనల కోసం దేశాలు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్దం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్-హమాస్, హిజ్బుల్లా సంస్థల మధ్య ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొనన ఉద్రిక్తతల పై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.