India Vote : పాలస్తీనాకు మద్దతు పలికే విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ వీడాలి అంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పాలని భారత్(India Vote) కోరింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ సైనిక దాడులు తక్షణమే నిలివేయాలని ఈ తీర్మానం స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల నుంచి వైదొలగాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేసింది.
Also Read :Devendra Fadnavis : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
1967 నుంచి తూర్పు జెరూసలెం సహా పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ ఆక్రమణలకు శాంతియుత పరిష్కారం లభించాలని కోరుతూ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా భారత్ సహా 157 దేశాలు ఓటు వేశాయి. దీనికి వ్యతిరేకంగా ఓటువేసిన దేశాల జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా సహా 8 దేశాలు ఉన్నాయి. ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఉరుగ్వే, పరాగ్వే, జార్జియా, ఈక్వెడార్, చెకియా, కామెరూన్ తదితర దేశాలు ఉన్నాయి. తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం చట్ట విరుద్ధమని పాలస్తీనా వాదిస్తోంది. ఈ అంశంలో తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా కోరుతోంది.
Also Read :Sukhbir Singh Badal : సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు.. స్వర్ణ దేవాలయంలో కలకలం
1947లో పాలస్తీనాను రెండుగా విభజించారు. అక్కడి అరబ్బుల కోసం పాలస్తీనా అనే దేశాన్ని, యూదుల కోసం ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటుచేయాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అప్పట్లో తీర్మానించింది. బ్రిటీషర్ల ఆధీనంలోని 55 శాతం భూభాగం ఇజ్రాయెల్‌కు, 45 శాతం భూభాగం పాలస్తీనాకు ఇచ్చారు. పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌లో వెస్ట్ బ్యాంక్, గాజా లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.