Site icon HashtagU Telugu

Maldives Vs India : మాల్దీవ్స్ నుంచి భారత సైన్యం వెనక్కి.. వారి ప్లేసులోకి వీరు !

India- Maldives

India- Maldives

Maldives Vs India : ‘‘మార్చికల్లా ఇండియన్ ఆర్మీని వెనక్కి పిలుచుకోండి’’ అంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పదేపదే భారత్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ప్రస్తుతమున్న దాదాపు 80 మంది భారతీయ సైనికులను వెనక్కి పిలుచుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆ 80 మంది స్థానంలో సాంకేతిక సిబ్బందిని మాల్దీవులకు పంపుతామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు.  మార్చి నెలలో కొంత మంది సైనికులను, మే నెలలో మిగతా అందరు సైనికులను భారత్ వెనక్కు పిలుచుకుంటుందని తెలిపారు. ఈవివరాలను మాల్దీవుల విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది.  భారత బలగాల ఉపసంహరణ అంశంపై ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా జరిగిన మాల్దీవులు, భారత్ విదేశాంగ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో పై నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ పొందిన అనంతరం ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటనను(Maldives Vs India) విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join

మాల్దీవుల అభివృద్ధికి భారత్ నిబద్ధతతో కూడిన భాగస్వామిగా కొనసాగుతుందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. తాజా మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ.  2023 బడ్జెట్‌లో ఆ దేశ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఇరుదేశాలు కలిసి ముందుకెళ్లడంపై స్పష్టత వచ్చిన తర్వాత కొత్త కేటాయింపులను సవరించే అవకాశం ఉందని జైస్వాల్‌ పేర్కొన్నారు.  కాగా, మాల్దీవులలో ఉన్న భారత ఆర్మీ.. అక్కడ భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

Also Read : Facebook Live Murder : ఫేస్‌బుక్ లైవ్‌‌లోనే మర్డర్, సూసైడ్.. వీడియో వైరల్.. ‘మహా’ కలకలం

మాల్దీవులలో భారత సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికులను మోహరించడానికి అవకాశం కల్పిస్తూ మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న నిర్ణయం భారత్‌కు దౌత్యపరమైన విజయం లాంటిది. ‘‘భారత సైన్యం అసలే వద్దు’’ అన్న మొయిజ్జు దీనికి అంగీకరించడం మాల్దీవుల వైఖరిలో వచ్చిన మార్పుగా చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు. జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే మాల్దీవులు ఇలా చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెల్లేరి అన్నారు. భారత సైన్యం ఉపసంహరణ విషయంలో తొలుత మొండిగా ఉన్న మాల్దీవులు, ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపునకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.