Indus Water : సింధూ జలాలకోసం భారత్ కు పాక్ వరుస లేఖలు

Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్.

Published By: HashtagU Telugu Desk
Indus Water

Indus Water

Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్. భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు లేఖలు భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. ఇందులో మొదటి లేఖను మే నెల ప్రారంభంలో రాసినప్పటికీ, మిగతా మూడు లేఖలను “ఆపరేషన్ సింధూర్” తర్వాత పంపినట్లు పలు జాతీయ మీడియాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ జల వనరుల శాఖ నుంచి భారతానికి ఈ లేఖలు వచ్చినట్లు అధికారిక సమాచారం ఉంది. అయితే, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ లో తీవ్ర సంక్షోభం వచ్చే అవకాశం ఉందని పాక్ గతంలో ఓ లేఖలో స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో చర్చించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం, ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా పంపినట్టు తెలుస్తోంది.

ఇందులో, వెనక్కు తగ్గేదేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. పాక్‌తో చర్చలు జరిగితే, అవి ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపైకి మాత్రమే పరిమితం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్–పాక్ సంబంధాలు పూర్తిగా దిగజారిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నది మరియు దాని ఉపనదుల జలాలను పంచుకునే ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

CM Revanth Reddy : మీ ఫాం హౌస్‌లు లాక్కుంటామన్లే.. మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నాం

  Last Updated: 06 Jun 2025, 06:58 PM IST